రంగారెడ్డి జిల్లా తండాలో.. గిరిజన మహిళల మధ్య గవర్నర్ తమిళిసై.. చెప్పింది చేశారు!
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పింది చేశారు. ఈ మధ్యాహ్నం ఆమె రంగారెడ్డి జిల్లాలోని కేసీ తండాను సందర్శించారు. అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకున్నారు. గవర్నర్‌కు ఇది సెకెండ్ డోస్ వ్యాక్సిన్. తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్నప్పటికీ- గిరిజనులకు అది అందట్లేదని, టీకాపై వారికి అవగాహనను కల్పించాల్సిన అవసరం ఉందనే కారణంతోనే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
మహేశ్వరం మండలంలో ఉంటుందీ కేసీ తండా. ఈ ఉదయం రాజ్‌భవన్ నుంచి బయలుదేరి వెళ్లిన తమిళిసై సౌందరరాజన్‌కు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం కేసీ తండాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేసుకున్నారు. ఆమెతో పాటు పలువురు గిరిజన మహిళలు కరోనా వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరాన్ని గిరిజనులకు తెలియజేయాలనే లక్ష్యంతోనే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తమిళిసై తెలిపారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గిరిజనులను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని, దీనికోసం తొలుత వారిని ఈ దిశగా చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. తాను స్వయంగా గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ కార్యక్రమంపై వారిలో నెలకొన్న అపోహలు, భయాందోళనలను పోగొట్టినట్టవుతుందని చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి తమిళిసై సౌందరరాజన్ ఇన్‌ఛార్జ్ లెప్టినెంట్ గవర్నర్‌గా ఉంటోన్నారు.

Recommended Video
ఆగస్టు 15వ తేదీ నాటికి పుదుచ్చేరిలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలనేది తమ లక్ష్యమని ఆమె అన్నారు. అక్కడ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తొలుత కొంత భ్రమలు నెలకొన్నప్పటికీ.. ఆ తరువాత అవి తొలగిపోయాయని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పుదుచ్చేరి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటోన్నారని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి అందరకీ టీకా ఇచ్చేలా ప్రణాళికలను రూపొందించుకున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications