రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారా - ప్రభుత్వం బిగ్ అప్డేట్..!!
రైతులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల పైన నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసింది. అదే సమయంలో గత సీజన్ లో నిధులు విడుదల చేసిన వారందరికీ తిరిగి ఈ సారి ఖాతాల్లో జమ చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సమయంలోనే నిధులు విడుదల చేస్తారని రైతులు వేచి చూసారు. కాగా, ఈ నెల 23న జరిగే మంత్రివర్గ భేటీలో ఈ నిధుల విడుదల పైన నిర్ణయం తీసుకొని.. 24వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం కనిపిస్తోంది.
రైతు భరోసా నిధుల కోసం రైతులు వేచి చూస్తున్నారు. రబీ సీజన్‌లో వరి నాట్లు, ఇతర పంటలు సాగు చేసి దాదాపు రెండు నెలలు దాటింది. అత్యధిక విస్తీర్ణంలో సాగైన వరి పంట కొన్ని ప్రాంతాల్లో పొట్టదశకు కూడా వచ్చింది. మందులు, ఎరువుల కోసం రైతులు వ్యాపారుల వద్ద అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరాకు మొత్తం రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది పేర్కొంది. దాని ప్రకారమే వానాకాలం పంటలకు సాయం మంజూరు చేసింది. అయితే, శాటిలైట్ సర్వే అంశం తెర మీదకు రావటంతో ఎంత మంది రైతులకు భరోసా నిధులు అందుతాయనేది చర్చగా మారింది. కాగా.. ప్రభుత్వం తాజాగా గత సీజన్ లో భరోసా నిధులు విడుదల చేసిన వారికి అందరికీ తిరిగి నిధులు జమ చేయాలని భావిస్తోంది. కాగా, శాటిలైట్ సర్వే (సింథటిక్ ఎపర్చర్ రాడార్ టెక్నాలజీతో శాటిలైట్ మ్యాపింగ్ సర్వే) ఆధారంగా కేవలం సాగుచేసిన భూములకే సాయం అందజేయాలని తాజాగా మరో వాదన మొదలైంది. దీంతో.. ఇప్పుడు మంత్రివర్గ భేటీ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో
తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా వేచి చేస్తున్న 'రైతు భరోసా' నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న రైతులకు పెట్టుబడిసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యాసంగి సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఈ నిధులను ఒకే విడతలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు వేగవంతం చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. రైతులకు సాగు పెట్టుబడికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మునిసిపల్ ఎన్నికల కోడ్, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు డబ్బు అవసరమైన తరుణంలో ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తే తమకు ఎంతో ఊరట కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.8,744.13 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చారు. దాదాపు 1,45,73,000 ఎకరాలకు నిధులు అందించారు. ఈ యాసంగిలోనూ దాదాపు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందనుంది.












Click it and Unblock the Notifications