జెమిని ఏఐ ద్వారా బ్యాంకుల్లో భారీగా సైబర్ క్రైమ్: కోర్టుకెక్కిన గూగుల్
ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ భారీ మోసాలకు తెగబడుతున్న సంస్థలపై ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటోంది. తన సొంత ప్రొడక్ట్ జెమిని ప్లాట్‌ఫామ్‌తో పాటు ఇతర ఏఐ టూల్స్ ను ఉపయోగించి మిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక మోసాలకు పాల్పడిన ఈ ముఠాపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అమెరికా కోర్టులో పిటీషన్ ఫైల్ చేసింది. దాదాపు 10 లక్షలకు పైగా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి ప్రజలను మోసం చేసినట్లు గూగుల్ గుర్తించింది.
న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ పిటీషన్ వేసినట్లు గూగుల్ తెలిపింది. 'అవుట్‌సైడర్ ఎంటర్‌ప్రైజ్' అనే నెట్‌వర్క్ ఈ సైబర్ నేరాల వెనుక ప్రధాన పాత్ర పోషించింది. సాంకేతిక పరిజ్ఞానం లేని సాధారణ వ్యక్తులు కూడా సులభంగా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించేలా ఈ ముఠా 'ఫిషింగ్ యాజ్ ఎ సర్వీస్' వేదికను సిద్ధం చేసింది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి ప్రజల వ్యక్తిగత వివరాలను దోచుకుంటున్నట్లు గూగుల్ ఈ పిటీషన్ లో వెల్లడించింది.

తమ జెమిని ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేసి అమెరికన్ వినియోగదారులను మోసం చేసిన వారిపై గూగుల్ చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. ఈ సైబర్ ముఠాను అరికట్టేందుకు ఎఫ్‌బీఐతో పాటు వెరిజోన్, ఏటీ అండ్ టీ, టీ మొబైల్ వంటి ప్రముఖ టెలికాం సంస్థలతో గూగుల్ చేతులు కలిపింది. గూగుల్ జనరల్ కౌన్సెల్ హలీమా డెలైన్ ప్రాడో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
అకౌంట్ హ్యాక్ అయిందనో, పార్శిల్ అలర్ట్ అంటూ వచ్చే మెసేజ్‌ల వెనుక పాస్‌వర్డ్స్, క్రెడిట్ కార్డ్ వివరాలను దొంగిలించడానికి రూపొందించిన ఏఐ ఆధారిత సైబర్ నెట్‌వర్క్ ను ఈ ముఠా రూపొందించినట్లు తెలిపారు. చైనా నుంచి పెద్ద ఎత్తున ఈ ముఠా కార్యకలాపాలుు సాగించిందని గుర్తించినట్లు ఆయన వివరించారు.
ఈ 'అవుట్‌సైడర్' సాఫ్ట్‌వేర్ సహాయంతో నేరగాళ్లు వివిధ ప్రసిద్ధ సంస్థల తరహాలోనే కనిపించే 290 కంటే ఎక్కువ ఉచిత వెబ్‌సైట్ టెంప్లేట్లను సిద్ధం చేశారు. ఇందులో ప్రముఖ మొబైల్ క్యారియర్లు, రవాణా సంస్థలు, రవాణా శాఖ న్యూయార్క్ ఈ-జెడ్ పాస్ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సేవల నకిలీ వెబ్‌సైట్లు ఉన్నాయి. వారం వ్యవధికి కేవలం 88 డాలర్లు చెల్లించి ఎవరైనా ఈ ముఠా సేవలను సబ్‌స్క్రైబ్ చేసుకునే వీలు కల్పించడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా నేరగాళ్లు కేవలం నకిలీ వెబ్‌సైట్లను సృష్టించడమే కాకుండా, వినియోగదారులు టైప్ చేసే కీస్ట్రోక్‌లను గుర్తించడం, వారి లాగిన్ వివరాలను ఆటోమేటిక్‌గా సేకరించడం వంటి ప్రమాదకర ఫీచర్లను కూడా లీజుకు ఇచ్చారు. మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (MFA) వంటి కఠినమైన భద్రతను సైతం దాటుకుని పోయేలా ఈ టూల్స్‌ను అభివృద్ధి చేశారని తెలుస్తోంది. దీంతో సాధారణ ఇంటర్నెట్ వినియోగదారులు సులభంగా మోసపోయే ప్రమాదం ఏర్పడింది.












Click it and Unblock the Notifications