TTD: తిరుమలకు ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు కీలక అప్డేట్..!!
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తున్న వేళ భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఆక్టోపస్ భవనం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 74,636 మంది భక్తులు దర్శించుకున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపట్టింది.
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. శనివారం అంటేనే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రెండో శనివారం కావడంతో పాటు విద్యాసంస్థలు తెరుచుకోనుండటంతో నేడు మరింత రద్దీ పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లు బయట వరకూ విస్తరించడంతో భక్తులు ఇబ్బందులు పడకుండా అవసర మైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇప్పటికే వేసవి రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీని చూసిన అధికారులు సిఫార్సు లేఖలను కూడా రద్దు చేశారు. వీఐపీలు కూడా వీలు చూసుకుని రావాలని కోరుతున్నారు.

రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో సామాన్య భక్తులను స్వామివారికి అలంకారం చేసే సమయంలో నూ అనుమతిస్తున్నారు. ఏ మాత్రం చిన్న అవకాశమున్నా భక్తులు దర్శనానికి అనుమతిస్తున్నా మని, తిరుమలలో అన్ని చోట్ల భక్తులతో నిండిపోయి ఉండటంతో వచ్చే భక్తులు టీటీడీ చర్యలకు సహకారం అందించాలని అధికారులు కోరుతున్నారు. కాగా.. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భక్తుల రద్దీని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. క్యూ లైన్ల నిర్వహణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఇదే సమయంలో భక్తులకు రీ ఎంట్రీ సదుపాయం కల్పిస్తున్నారు. తిరిగి విద్యా సంస్థలు ప్రారంభం కావటంతో.. ఇక రద్దీ తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక.. అలిపిరి కేంద్రంగా ఇప్పటికే సిద్దం చేసిన కార్యాచరణ అమలు దిశగా టీటీడీ అధికారులు ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు.














Click it and Unblock the Notifications