కరోనా: లాక్‌డౌన్ మళ్లీ పొడగింపు.. ఈసారి ఎన్ని రోజులంటే.. ఇంటి అద్దెలపైనా కీలక నిర్ణయం
రెండో దశ లాక్ డౌన్ లోనూ కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్నది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే 1334 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 15,712కు, మరణాల సంఖ్య 507కు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈనెల 20 నుంచి కొన్ని రంగాలకు లభించనున్న లాక్ డౌన్ మినహాయింపులపై సందిగ్ధత నెలకొంది. హాట్ స్పాట్ జిల్లాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మినహాయింపులు ఉండబోమని కేంద్రం స్పష్టం చేసింది. అటు ఢిల్లీ సర్కారు కూడా రిలాక్సేషన్లకు నో చెప్పింది. ఇదే క్రమంలో తెలంగాణ సర్కారు మరో అడుగు ముందుకేసి.. ఏకంగా లాక్ డౌన్ ను కూడా పొడగించింది. సీఎం కేసీఆర్ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు.

సీఎం సుదీర్ఘ చర్చ..
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. ఇక్కడి తొమ్మిది జిల్లాలు రెడ్ జోన్ లో ఉండగా, మరో 20 జిల్లాలు ఆరెంజ్ జోన్ లోకి చేర్చుతూ కేంద్రం జాబితా రూపొందించింది. ఆయా జిల్లాల్లో ఎక్కడ కూడా కేసుల తగ్గుదల చోటుచేసుకోలేదు. ఈనెల 20 నుంచి అగ్రికల్చర్, ఫుడ్ ప్రొడక్షన్, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో పనులు జరిగేలా లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. లాక్ డౌన్ రిలాక్సేషన్లకు సంబంధించి కేంద్రం సూచనలు మాత్రమే చేస్తూ.. నిర్ణయాలను మాత్రం రాష్ట్రాలకే వదిలేసిన దరిమిలా ఏ విధంగా ముందుకెళ్లాలనేదానిపై సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. ఆదివారం హైలెవల్ మీటింగ్స్ తోపాటు కేబినెట్ భేటీని కూడా ఆయన నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మే 7 వరకు పొడగింపు
తెలంగాణలో లాక్ డౌన్ మే 7 వరకు పొడగించే విషయమై సీఎం అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న కంటైన్‌మెంట్ జోన్లలో 14రోజుల తప్పనిసరి ఐసోలేషన్ ప్రక్రియ ఆ గడువులోగా ముగియనుండటంతో.. కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ కంటే నాలుగు రోజులు అదనంగా పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. కేబినెట్ లో ప్రధానంగా దీనిపైనే చర్చించామని, లాక్ డౌన్ అమలుపై నిర్ణయాలు రాష్ట్రం పరిధిలోనే ఉన్నందున, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మే 7 వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు.

అద్దెలు వాయిదా..
లాక్ డౌన్ నేపథ్యంలో దుకాణాలు మూతపడటం, ఉద్యోగస్తుల జీతాలు, కూలీలకు ఉపాధి దొరక్క ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో ఆయా భవనాలు, ఇళ్ల యజమానులు మూడు నెలల పాటు అద్దెల వసూళ్ళను వాయిదా వేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు సీఎం చెప్పారు. మార్చి, ఏప్రిల్, మే అద్దెలను ఓనర్లు వసూలు చేయరాదని, ఆ మొత్తాన్ని తర్వాతి కాలంలో విడతలవారీగా తీసుకోవాలని ఆదేశించారు. పొడగించిన కాలానికి వడ్డీలు వసూలు చేయడం లాంటివి కూడదలని హెచ్చరించారు. కోటి మంది జనాభా ఉండే హైదరాబాద్ లో ఈ నిర్ణయం ప్రజలకు మేలు చేస్తుందని ప్రభుత్వం ఆశిస్తున్నది. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే..

ఈ-కామర్స్ బ్యాన్..
లాక్ డౌన్ ఎగ్జిట్ లో భాగంగా ఈనెల 20 నుంచి మినహాయింపులు లభించాల్సిన మరో రంగం.. ఈ-కామర్స్. ఇప్పటిదాకా ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందించిన సదరు ఈకామర్స్ సంస్థలు.. సోమవారం నుంచి అన్ని రకాల ఉత్పత్తుల్ని అమ్ముకోవచ్చని కేంద్రం సూచించింది. కానీ ఒకరోజు ముందు, అంటే ఆదివారం సడెన్ గా కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. మే 3 దాకా ఈకామర్స్ విక్రయాలకు రిలాక్సేషన్ కల్పించబోవడంలేదని స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో మాత్రం ఏకంగా అన్ని రకాల ఈ-కామర్స్ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించింది. పైగా, హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ బాయ్ ఒకరు వైరస్ కు గురికావడం కలలకలం రేపింది. ఆన్ లైన్ డెలివరీల జోలికి పోవద్దని, పండుగల్ని ప్రజలు ఇళ్లలోనే చేసుకోవాలని సీఎం చెప్పారు.