తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలు!
ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక చర్యలను చేపడుతుంది. ఈ క్రమంలోనే నిరుపేదలకు కూడా ఆరోగ్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే హెల్త్ ఏటీఎంలను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకుంది.
పైలెట్ ప్రాజెక్టు కింద ఈ హెల్త్ ఏటీఎంల ఏర్పాటు
వేగవంతమైన రోగ నిర్ధారణ చేసే ఈ యంత్రాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉంటే ఈ ఏటీఎంల ద్వారా పరీక్షలు నిర్వహించడం సులభతరమవుతుంది. ఇప్పటికే హైదరాబాద్లోని కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, మలక్ పేట ఏరియా ఆసుపత్రులలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ హెల్త్ ఏటీఎంలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి పరీక్షించారు.

హెల్త్ ఏటీఎంల పనితీరు, రోగ నిర్ధారణలో కచ్చితత్వం
ఈ ప్రయోగాలు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వీటిని విస్తరించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఔట్ పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ హెల్త్ ఏటీఎంల పనితీరు, రోగ నిర్ధారణలో వాటి కచ్చితత్వాన్ని నిర్ధారించడం కోసం చాలా విస్తృతమైన పరీక్షలను నిర్వహించారు. వీటిలో టెస్టులు చేయించుకున్న రోగులను మూలాలను మళ్లీ డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు
ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ లలోను వారికి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్ల వైద్య పరీక్షల ఫలితాలతో, హెల్త్ ఏటీఎంల ఫలితాలు సరిపోలడంతో అవి సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని, రిపోర్ట్ లు కచ్చితంగా ఇస్తున్నాయని ధ్రువీకరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
హెల్త్ ఏటీఎంలు 132 రకాల మెడికల్ టెస్ట్ లు
పేషెంట్ ల రద్దీ అధికంగా ఉండే ఆసుపత్రులలో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా, ప్రజలకు వేగంగా ఆరోగ్య సేవలను అందించవచ్చని వారు చెబుతున్నారు. నిమిషాల వ్యవధిలోనే ఈ హెల్త్ ఏటీఎంలు 132 రకాల మెడికల్ టెస్ట్ లను ఆటోమేటిక్ గా పూర్తి చేస్తాయని చెబుతున్నారు. ఈ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ మెడికల్ పరికరాలతో పనిచేసే హెల్త్ ఏటీఎంలు అన్ని ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను డాక్టర్ తో సంబంధం లేకుండానే పూర్తి చేస్తాయి.
ఈ వ్యాధులపై రాపిడ్ టెస్ట్ లు
అవి రోగుల శరీరాన్ని స్కాన్ చేసి బిపి గుర్తిస్తాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను, బరువు, ఎత్తు, శరీర ఉష్ణోగ్రత వంటి కీలక వివరాలను వేగంగా గుర్తిస్తాయి. అంతేకాదు మలేరియా, డెంగ్యూ, యూరిన్, కొలెస్ట్రాల్, ఈసీజీ, షుగర్ వంటి రాపిడ్ టెస్ట్ లను కూడా ఈ యంత్రాలు తక్షణమే నిర్వహిస్తాయి. అంతేకాకుండా, ఇవి రోగుల డిజిటల్ హెల్త్ రికార్డ్‌ను కూడా తయారు చేసి భద్రపరుస్తాయి. వైద్య పరీక్షలు పూర్తయ్యాక, దీని ద్వారానే డాక్టర్‌తో సంప్రదించే అవకాశం కూడా రోగులకు లభిస్తుంది.
హెల్త్ ఏటీఎం మెషీన్ల అభివృద్ధి
ఒక ప్రైవేట్ సంస్థ ఈ హెల్త్ ఏటీఎం మెషీన్లను అభివృద్ధి చేయగా, వాటిని రెండు నెలల పాటు క్షుణ్ణంగా పరీక్షించారు. ఈ హెల్త్ ఏటీఎంల రాకతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కోసం వేచి చూసే సమయం బాగా తగ్గి, రోగులకు మరింత వేగవంతంగా వైద్య సేవలు అందనున్నాయి. ఈ మార్పు ప్రజలకు మెరుగైన, సత్వర వైద్య సహాయాన్ని అందించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications