వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు ఉత్వర్వులు
హైదరాబాద్: తెలంగాణ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వీఆర్ఏల సర్దుబాటును హైకోర్టు నిలిపివేసింది. వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. జులై 24న జీవోకు ముందున్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తూ ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా రెవెన్యూ శాఖ జులై 24న జీవో 81, ఆర్థిక శాఖ ఆగస్టు 3న జీవో 85 జారీ చేశాయి. ఇతర శాఖల్లోకి నియమిస్తూ ఆగస్టు 3న సీసీఎల్ఏ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 61 ఏళ్ల లోపు వయస్సున్న 16,758 మంది వీఆర్ఏలను వారి విద్యార్హతలను అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో లోయర్ గ్రేడ్ సర్వీస్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉద్యోగ విరమణ వయసు దాటిన మరో 3797 మంది వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే, చట్టాలు, సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందని.. తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని పలువురు వీఆర్ఏలు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
పిటిషనర్ల వాదనతో ప్రాథమికంగా ఏకీభవించిన హైకోర్టు జీవోలను సస్పెండ్ చేస్తూ జులై 24కి ముందు స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్నికల కమిషన్ ను ప్రతివాదుల జాబితాలో తొలగించాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో వీఆర్ఏల సర్దుబాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.












Click it and Unblock the Notifications