దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు.. ఆరోజు ఏం జరిగింది?
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. 2013 ఫిబ్రవరి 21న బస్ స్టాండ్, మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమం ఇప్పటికీ హైదరాబాద్ వాసులను వెంటాడుతోంది.ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఇవాళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
తీవ్రవాద సంస్థ అయిన ఇండియన్ ముజాహిద్దీన్ ఈ పేలుళ్లకు పాల్పడింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి మారణహోమానికి తెరతీసింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులకు NIA ప్రత్యేక కోర్టు 2016 డిసెంబర్ 13న ఉరి శిక్ష విధించింది. ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు. అయితే ఈ నిందితులు NIA ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించింది.

ఏం జరిగింది..?
2013 ఫిబ్రవరి 2వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో మొదటి పేలుడు సంభవించింది. మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే దిల్ సుఖ్ నగర్ లోని వెంకటాద్రి థియేటర్ ముందు ఉన్న 107 నంబరు గల బస్ స్టాప్ వద్ద జరిగింది. రెండో పేలుడు కోణార్క్ థియేటర్ సమీపంలోని ఏ-1 మిర్చి సెంటర్ వద్ద కొద్ది క్షణాల వ్యవధిలోనే జరిగింది. రెండు పేలుళ్లు 150 మీటర్ల దూరంలోనే జరిగాయి. తీవ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమంలో మొత్తం 18 మంది మృత్యువాతపడ్డారు. 131 మంది గాయపడ్డారు. ఈ పేలుడుపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ పేలుళ్ల ఘటనపై ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. కానీ కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దీంతో హైదరాబాద్ లో నమోదైన ఈ రెండు కేసులు ఎన్‌ఐఏకి బదిలీ అయ్యాయి. దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ (యూపీ), జియా-ఉర్-రెహమాన్ (పాకిస్థాన్), తెహసీన్ అక్తర్ (బీహార్), అజాజ్ షేక్ (మహారాష్ట్ర) కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీంతో పాటు దాదాపు పదికి పైగా బాంబు పేలుళ్ల ఘటనల్లో యాసిన్ భత్కల్ పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
ఈ కేసుపై ఎన్ఐఏ సంస్థ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా యాసిన్ భత్కల్, అబ్దుల్లా అక్తర్ అలియాస్ హద్దిలను 2013లో ఇండో- నేపాల్ సరిహద్దు సమీపంలో అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారు. యాసిన్ భత్కల్, హద్దిలు ఇచ్చిన సమాచారం మేరకు బిహార్ కు చెందిన తహసీన్ అక్తర్, పాకిస్థాన్ కు చెందిన జియా ఉర్ రెహమాన్ లను 2014లో దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లతో పాటు పుణేకు చెందిన అజిజ్ షేక్ ను కూడా ఎన్‌ఐఏ సంస్థ అరెస్ట్ చేసింది.

ఎన్ఐఏ సంస్థ నిందితులపై జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లకు కీలక సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్ గా అధికారుల గుర్తించారు. కర్ణాటక లోని బక్తల్ కు చెందిన రియాజ్ బక్తల్ ఇప్పటికీ పాకిస్థాన్ లోనే ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. అయితే ఈ ఘటనపై ఆరుగురు నిందితులపై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో 3 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో విచారణ కొనసాగింది.
ఎన్ఐఏ సంస్థ విచాణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించింది. వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించింది. 2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులను ఎన్‌ఐఏ కోర్టు దోషులుగా గుర్తించింది. 2016 డిసెంబర్ 19న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది. అయితే నిందితులు ఎన్‌ఐఏ కోర్టు తీర్పుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్ పై విచారణ జరుగుతోంది.నిందితులు అంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు.
ఆ కీలక సూత్రధారి మృతి
హైదరాబాద్ నగరంతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది సయ్యద్ మఖ్బూల్ గతేడాది అనారోగ్యంతో కన్నుమూశాడు. చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న సయ్యద్ అనారోగ్యంతో గతేడాది మృతి చెందాడు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్. 2006లో వారణాసి, 2007లో ముంబై వరుస పేలుళ్లు, 2008లో జైపుర, 2008లో దిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరుతో పాటు హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల వెనుక ఇతని పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది.
మృతుల వివరాలు..
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మరణించినవారిలో 14 మంది వివరాలను అప్పుడు అధికారులు వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతూరుకు చెందిన దుర్గాప్రసాద్ (23), నల్లగొండ జిల్లాకు చెందిన రాజేందర్ రెడ్డి (21), హైదరాబాద్ బోరబండకు చెందిన మారుతి (23) పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. 1. ఎ రాములు (వారాసిగుడా, హైదరాబాద్) 2. ఎజాజ్ అహ్మద్ (ప్రేమ్‌నగర్, అంబర్‌పేట, హైదరాబాద్, పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం విద్యార్థి) 3. మహ్మద్ రఫీ (బాబానగర్, హైదరాబాదులోని చాంద్రాయణగుట్టలో బ్యాగులు కుట్టే వ్యక్తి) 4. ముత్యాల రాజశేఖర్ (ఎంబిఎ), (ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నంనూర్ గ్రామం) 5. వడ్డే విజయ్ కుమార్ (ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నంనూర్ గ్రామం) 6. హరీష్ కార్తిక్ (దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్, స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల) 7. పద్మాకర్ దివాన్‌జీ (కొత్తపేట జిలేబీ తయారీదారుడు) 8. వెంకటేశ్వర రావు (వెటర్నరీ అసిస్టెంట్ మలక్‌పేట్, స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ) 9. స్వప్నారెడ్డి (సంతోష్‌నగర్, ఎంబిఎ విద్యార్థి) 10. ఆనంద్‌కుమార్ (బిటెక్ ఇసిఇ చివరి సంవత్సరం, నోవా కళాశాల, రామోజీ ఫిలం సిటీ వద్ద, స్వస్థలం అనంతపురం జిల్లా 11. తిరుపతయ్య (గోదావరిఖని, కరీంనగర్ జిల్లా) 12. శ్రీనివాసరెడ్డి (రెంటచింతల, గుంటూరు జిల్లా) 13. చోగారం కులాజీ (రాజస్థాన్) 14. గిరి (రామన్నపేట, నల్లగొండ జిల్లా) ఓమ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications