తెలంగాణలో కరోనా కలకలం: హైకోర్టు ఆందోళన, సర్కారుకు కీలక ఆదేశాలు, పాఠశాలల్లోనూ..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలను భారీగా పెంచాలని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, పాఠశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు.

కరోనా పరీక్షలు 50వేలలోపే...
ప్రతిరోజూ 50వేల పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మార్చి 7,11,12,13 తేదీల్లో వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 50వేల పరీక్షలు నిర్వహించినట్లు లేదన్నారు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని కోర్టును కోరారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సమయంలో, పోలింగ్ రోజు కరోనా నిబంధనలు పాటించకపోవడం కారణంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని తెలిపారు. అంతేగాక, ఇప్పుడు హోలీ పండగ కూడా రాబోతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోర్టును అభ్యర్థించారు.

తెలంగాణ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ క్రమంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. అంతేగాక, ప్రతిరోజూ 50వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజూ బులిటెన్ విడుదల చేస్తున్నామని అడ్వోకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.

గురుకుల పాఠశాలల్లో కరోనా విజృంభణ
ఇది ఇలావుండగా, తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కరోనా బారినపడుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 28 కరోనా కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఎస్టీ బాలుర హాస్టల్‌లో మొత్తం 105 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. 22 మంది విద్యార్తులతోపాటు వార్డెన్, సెక్యూరిటీగార్డుకు కరోనా పాజిటివ్ అని తేలింది. బైంసా గురుకుల పాఠశాలలోనూ 30 మందికిపైగా విద్యార్థులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వీరందరికి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. 2వేలకుపైగా యాక్టివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 59,905 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 278 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,047కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి మరో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1662కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 111 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,98,120కి చేరింది. తెలంగాణ ఇప్పటి వరకు 94,19,677కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 2265 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications