తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల: సత్తా చాటిన అబ్బాయిలు
వరంగల్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్(ICET) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ రమేష్ వరంగల్‌లో విడుదల చేశారు.
తొలి మూడు ర్యాంకుల్లోనూ అబ్బాయిలే సత్తా చాటారు. నూకల శరణ్ కుమార్ మొదటి ర్యాంక్ సాధించగా.. సాయినవీన్ ద్వితీయ, రవితేజ మూడో ర్యాంకు పొందారు. మే నెల 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించిన ఐసెట్ పరీక్షకు దాదాపు 70వేల మందికిపైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in/ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణలో ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు నమోదు ప్రారంభం
తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు బుధవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో భర్తీ చేయబోయే ఇంజినీరింగ్ సీట్ల వివరాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 137 ప్రైవేట్ కాలేజీల్లో 80,091 సీట్లు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.
16 యూనివర్సిటీ కాలేజీల్లో4713 సీట్లు, రెండు ప్రైవేట్ వర్సిటీల్లో 1302 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62,079 సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అత్యధికంగా సీఎస్ఈలో 15,897, ఈసీఈలో 9734 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. జూన్ 28 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది.
కాగా, డిప్లొమా పాలిటెక్నిక్ కోర్సులను రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ పరిధిలోకి తీసుకొస్తూ తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా ఫీజులను ఏఎఫ్ఆర్సీ ఖరారు చేయనుంది. డిప్లొమా కోర్సులను ఏఎఫ్ఆర్సీ పరిధిలోకి తేవాలని సాంకేతిక విద్యాశాఖ గత ఏడాది ప్రతిపాదించింది. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు విద్యాశాఖ జీవో నెంబర్ 41 జారీ చేసింది.












Click it and Unblock the Notifications