పేదరికంలో తెలంగాణా ఉందని ఆ దృశ్యాలు చూస్తే అనిపించింది: మాజీ ఐఏఎస్
పేదరికంలో తెలంగాణా ఉందని ఆ దృశ్యాలు చూస్తే అనిపించిందని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని అనేక సమస్యలపై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఎంతోకాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, రాష్ట్రంలోని అనేక జిల్లాలలో చోటుచేసుకున్న సమస్యలపై ప్రశ్నిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసే పనిలో పడ్డారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అని ప్రభుత్వం చెబుతుందని, కానీ అడుగడుగునా పేదల బతుకులు కళ్ళకు కడుతున్నాయని ఇది ఎటువంటి బంగారు తెలంగాణా అవుతుందో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా నిన్న గద్వాల్ జిల్లా గట్టులో పర్యటించిన ఆయన అక్కడి పరిస్థితులను గురించి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదరికం గురించి మాట్లాడిన ఆకునూరి మురళి నిన్నంతా గద్వాల్ జిల్లా అతిపేద మండలం గట్టులో నడిగడ్డ హక్కుల పోరాట సమితికి సంఘీభావంగా పాదయాత్ర చేసామని పేర్కొన్నారు. అక్కడ ఎన్నో దుర్భరమైన పరిస్థితులను చూసామని ఆ పరిస్థితులను కళ్ళకు కట్టారు. ఎప్పుడూ బడికిపోని పిల్లల్ని చూసామని, బాల కార్మికులను చూశామని ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా గూడు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదల బతుకులు చూసానని పేర్కొన్న ఆకునూరి మురళి, చిన్న చిన్న రేకుల ఇల్లు, పూరి గుడిసెలు చూసామని, అక్కడి ప్రజలు దుర్భర జీవితాన్ని చూసానని పేర్కొన్నారు. ఇంకా మహిళలు, పిల్లలు చెప్పులు లేకుండా మండుటెండలో తిరగడం చూసామని.. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఇంకా పేదరికం ఉందని చెప్పడానికి ఈ పరిస్థితులే సాక్ష్యమని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పేర్కొన్నారు.
నిన్నంతా గద్వాల్ జిల్లా అతిపేద మండలం గట్టు లో నడిగడ్డ హక్కుల పోరాట సమితికి సంఘీభావంగా పాదయాత్ర చేసాము
— Murali Akunuri (@Murali_IASretd) March 18, 2023
బడికి ఎప్పుడూపోని పిల్లల్ని,బాలకార్మికులను చూసాము
చిన్నచిన్న రేకుల ఇండ్లు పూరి గుడిసెలు చూసాము
మహిళలు పిల్లలు చెప్పులు లేకుండా మండుటెండలో తిరగడం చూసాము
ఇంకా పేదరికం తెలంగాణాలో pic.twitter.com/QTWotf2mAz
ఇటీవల టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని టార్గెట్ చేసిన ఆకునూరి మురళి బంగారు తెలంగాణ ఏమో కానీ అవినీతి తెలంగాణా తయారు చేశారంటూ నిప్పులు చెరిగారు. పైనోళ్లు భయంకరమైన అవినీతి చేస్తుంటే కింద వాళ్ళు ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు. దారుణమైన పరిపాలన, దుష్ట పరిపాలన అంటూ నిప్పులు చెరిగారు. ఇక రాష్ట్రంలో స్కూళ్ళ దుస్థితిని, టీచర్లు లేని పరిస్థితులను, సర్పంచులు, పంచాయితీ ఉద్యోగులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను ప్రస్తావిస్తున్న ఆకునూరి మురళి ఇదెక్కడి బంగారు తెలంగాణ అని నిలదీస్తున్నారు.












Click it and Unblock the Notifications