
కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీనం? రేవంత్ పగ్గాలు చేపట్టాక తెర పైకి ఈ ప్రచారం... కోదండరాం రియాక్షన్ ఇదే...
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక రాష్ట్ర రాజకీయంలో ట్రయాంగిల్ ఫైట్ మొదలైంది. టీఆర్ఎస్,బీజేపీల మాదిరి దూకుడైన నాయకత్వం లేకపోవడంతో ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ రాజకీయం చప్పగానే సాగింది. రేవంత్ సారథ్య బాధ్యతలు చేపట్టడంతో ఇక కాంగ్రెస్‌కు పునర్వైభవం వస్తుందన్న ఆశ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ ఎలాగైతే టీఆర్ఎస్‌ను బలోపేతం చేశారో... ఇప్పుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీనం అన్న ప్రచారం తెర మీదకు వచ్చింది.

రాజకీయ పునరేకీకరణ జరగబోతుందా?
కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో పార్టీని వీడిన వారిని... టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్తులను... గతంలో క్రియాశీలక రాజకీయాల్లో ఉండి ఇప్పుడు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయిన నేతలను... ఇలా అందరినీ కలుపుకుని కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ చేయాలనే యోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో కోదండరాం సారథ్యంలోని టీజేఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ను గద్దె దించడమే రెండు పార్టీల లక్ష్యం కాబట్టి.. ఇందుకోసం టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కోదండరాం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కోదండరాం రియాక్షన్....
కోదండరాం మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. తెలంగాణ జనసమితి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ మాత్రమే కాదు మరే ఇతర పార్టీలోనూ తమ పార్టీని విలీనం చేయమని చెప్పారు. విలీనం కోసం లేదా పొత్తుల కోసం ఇప్పటివరకూ తాము ఎవరితోనూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడే కాదు... రెండేళ్ల క్రితం ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీనం అవుతుందన్న ఊహాగానాలు వినిపించాయి. అప్పట్లోనూ ఆ ప్రచారాన్ని కోదండరాం ఖండించారు.

గతంలోనూ... కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని...
ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో కోదండరాం మాట్లాడుతూ... చివరిసారిగా రెండేళ్ల క్రితం లక్డీకపూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆయనతో మళ్లీ భేటీ కాలేదన్నారు. పార్టీ విలీనంపై రేవంత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. మరో సందర్భంలో ఇదంతా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారమే అని ఆరోపించారు. నిజానికి ఉద్యమ సమయంలోనూ కోదండరాం కాంగ్రెస్ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నారని... కేసీఆర్‌కు తెలియకుండా సోనియాను కూడా కలిశారని గతంలో టీఆర్ఎస్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. జేఏసీ ముసుగులో ఆయన కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. ఇవన్నీ కోదండరాం పార్టీ పెట్టక ముందు చేసిన ఆరోపణలు. ఆయన పార్టీ పెట్టాక రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారేమోనన్న ఊహాగానాలు అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కోదండరాం మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చి చెబుతున్నారు.