కాపాడండి: ఢిల్లీలో తెలంగాణ జర్నలిస్టుల ఆందోళన
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో తెలంగాణ జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర జర్నలిస్టుల ప్రాణాలు కాపాడాలంటూ టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవ్ ధర్నాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 400 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
గడిచిన నాలుగేళ్లలో తెలంగాణలో 220 మంది జర్నలిస్టులు మృతి చెందారని జర్నలిస్టు సంఘం నేతలు తెలిపారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉచిత వైద్యం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్నాకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. ధర్నా అనంతరం జర్నలిస్టులు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి వినతి పత్రం అందజేశారు.
జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లు:
- ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి
- ఎలక్ట్రానిక్ మీడియాను వర్కింగ్ జర్నలిస్టు చట్టం పరిధిలోకి తేవాలి
- మజీథియా వేజ్‌బోర్డు సిఫార్సులు అమలు చేయాలి
- జర్నలిస్టులకు సక్రమంగా ఆరోగ్య పథకాలు అమలు పరచాలి
- మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు సంక్షేమ నిధి మొత్తం పెంచాలి.
- ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయం రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచాలి.
- రాష్ట్ర జర్నలిస్టులకు, జర్నలిస్టు కుటుంబాలకు హెల్త్ కార్డులు జారీ చేయాలి
- సీఎం కేసీఆర్ హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల పథకం వెంటనే అమలు చేయాలి
- వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని సవరించాలి
- జర్నలిస్టుల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తెలపాలి.
- జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలి.












Click it and Unblock the Notifications