రూ.7 వేల కోట్ల భారీ ప్రాజెక్ట్ లో తెలంగాణాకు స్థానం.. ఇకపై ఇంటింటికీ గ్యాస్!
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరా వ్యవస్థలో మార్పులు తీసుకురావటానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.7 వేల కోట్ల వ్యయంతో 1,800 కిలోమీటర్ల పొడవైన కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. ఈ ప్రాజెక్ట్ కు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు అధికారిక ఆమోదం తెలిపింది.
ఎల్పీజీ పైప్ లైన్ నెట్వర్క్ ఏర్పాటు
దేశవ్యాప్తంగా నిత్యావసరంగా మారిన వంట గ్యాస్ కోసం ప్రభుత్వం రోడ్డు, రైలు మార్గాలపై ప్రస్తుతం ఆధారపడుతుంది. అయితే దీంతో రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. దీనిని తగ్గించటం కోసం, కేంద్రం సంకల్పించింది అందుకే ఎల్పీజీ పైప్ లైన్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో తెలంగాణకు కీలక స్థానం దక్కింది. రాష్ట్రంలోని చర్లపల్లి నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు 556 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మించనున్నారు.

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాలకు అనుసంధానం
ఈ మార్గం ద్వారా తెలంగాణకు వంటగ్యాస్ సరఫరా మౌలిక వసతులు మరింత బలపడతాయి. నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ చేపట్టనుంది. కొత్త నెట్‌వర్క్ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాలను అనుసంధానిస్తుంది. దీని కోసం మూడు ప్రధాన మార్గాలు ప్రతిపాదించారు.
దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ సుమారు 7,700 కిలోమీటర్లు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ వరకు 611కిలోమీటర్లు, మహారాష్ట్రలోని షిక్రాపూర్ నుంచి గోవా-కర్ణాటకలోని హుబ్లీ వరకు 633 కిలోమీటర్లు, అలాగే చర్లపల్లి-నాగ్‌పూర్ మార్గం ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ సుమారు 7,700 కిలోమీటర్లు ఉంది. కొత్త ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఇది దాదాపు 9,500 కిలోమీటర్లకు విస్తరించనుంది.
వినియోగ కేంద్రాలకు నిరంతరాయంగా ఎల్‌పీజీ అందించే సామర్థ్యం
పైప్‌లైన్ ద్వారా రవాణా పెరగడం వల్ల రోడ్డు, రైలు మార్గాలపై ఆధారపడటం తగ్గుతుంది. అదే సమయంలో వినియోగ కేంద్రాలకు నిరంతరాయంగా ఎల్‌పీజీ అందించే సామర్థ్యం పెరుగుతుంది. ప్రజలకు కూడా అవసరం అయినంత గ్యాస్ ను వినియోగించుకోవచ్చు. దేశంలో ఎల్‌పీజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు విస్తరణ తెలంగాణా రాష్ట్రానికి కూడా లబ్ధిని చేకూరుస్తుంది.












Click it and Unblock the Notifications