కేసీఆర్ లక్ష్యం అదే: రాజీనామా చేస్తానంటూ కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
సూర్యపేట: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు తెలంగాణ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులతో తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడితే.. కేంద్రం రూ. 100 లక్షల కోట్ల అప్పు చేసి ఏం మంచి పనులు చేసిందని ప్రశ్నించారు. సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

తెలంగాణ నిధులు ఆ రాష్ట్రాలకేనంటూ కేటీఆర్
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ నిధులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారని.. ఈ విషయాన్ని తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు.

రాజీనామా చేస్తానంటూ కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
తెలంగాణ ప్రజలు వివిధ పన్నుల రూపంలో 8ఏళ్లలో కట్టిన రూ. 3.6 లక్షల కోట్లు అని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చింది రూ. 1.68 వేల కోట్లు అని చెప్పారు. తెలంగాణ నిధులతో వెనుబడిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. తాను చెప్పేది అబద్ధమైతే.. తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధమని కేటీఆర్ అన్నారు. అంతేగాక, తాను చెప్పింది తప్పని రుజువు చేయకపోతే కేంద్రమంత్రి రాజీనామా చేస్తారని అనుకోను కానీ, కనీసం రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పే సంస్కారం ఉందా? అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.

కేసీఆర్ బీఆర్ఎస్ లక్ష్యం అదేనన్న కేటీఆర్
ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు కేటీఆర్. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ. లక్షా 24వేలు కాగా, ఈరోజు రూ. 2 లక్షల 78 వేలు అని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ తలసరి ఆదాయం రూ. లక్షా 49వేలు మాత్రమేనని.. అలాంటప్పుడు ఎవరు సమర్థులని ప్రశ్నించారు. దేశానికి వేగు చుక్క మన తెలంగాణ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారింది.. దేశాన్ని బాగు చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమని కేటీఆర్ తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications