పవన్ కల్యాణ్‌కు ఈసీ నోటీసులంటూ ప్రచారం -బీజేపీని తిట్టిన గంటల్లోనే -ఇదీ విషయం -కమలంతో జనసేన విడాకులు?
ఇటు తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, అటు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదివారం కోలాహలం నెలకొంది. ఏపీలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఫలితాలపై మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, రెండు రాష్ట్రాల్లోనూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ గా నిలిచారు. తెలంగాణ ఎమ్మెల్సీ, ఏపీ మున్సిపల్ ఎన్నికలపై ఆయన అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు సంబంధించి పవన్ కు ఎన్నికల సంఘం నోటీసులు కూడా ఇచ్చిందని ప్రచారం జరిగింది.

పోలింగ్ వేళ పవన్ కలకలం..
తెలంగాణలో ని రెండు గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ తరఫున రామచంద్రరావు బరిలో ఉన్నారు. ఇదే స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవిని పోటీకి దింపింది. బీజేపీతో అటు ఏపీలో, ఇటు తెలంగాణలోనూ పొత్తు కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్.. సరిగ్గా పోలింగ్ జరుగుతున్న సమయంలో తాము(జనసేన) టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామంటూ చేసిన ప్రకటన కలకలం రేపింది. ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం కూడా కావడంతో ఆ సందర్భంగా మాట్లాడుతూ పవన్ ఈ కామెంట్లు పాస్ చేశారు..

జనసేనానికి ఈసీ నోటీసులంటూ..
ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న సమయంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణికి పవన్ మద్దతు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా పవన్ ప్రకటన ఉందని ఎన్నికల సంఘం భావించిందని, పోలింగ్ వేళ ఇలాంటి వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని, మేరకు వివరణతో కూడిన సమాధానం చెప్పాల్సిందిగా పవన్‌కు ఈసీ నోటీసులు జారీ చేసిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, పవన్ పై ఫిర్యాదులు రాలేదని, ఆయనకు నోటీసులు జారీ చేశామన్నదీ నిజం కాదని ఈసీ ఆలస్యంగా వివరణ ఇచ్చింది. కాగా,

బీజేపీతో పవన్ వీడాకులు?
రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీతో పొత్తు కొనసాగిస్తోన్న పవన్ కల్యాణ్.. జీహెచ్ఎంసీలో పోటీ నుంచి తప్పుకున్నందుకు ప్రతిఫలంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అవకాశాన్ని ఆశించారు. కానీ ఆ స్థానం నుంచి బీజేపీలో బరిలోకి దిగేలా, వారికి జనసేన మద్దతు ఇచ్చేలా పవన్ కు కమలనాథులు ఒప్పించగలిగారు. ఈ మేరకు శుక్రవారం ఉమ్మడి ప్రకటన వెలువడగా, ఆదివారం నాటి జనసేన ఆవిర్భావ దినోత్సవంలో తెలంగాణ బీజేపీని ఉద్దేశించి జనసేనాని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర శాఖ మాత్రం జనసేనను అవమానిస్తోందని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతిస్తున్నామని పవన్ వ్యాఖ్యానించారు. విషయం ఎమ్మెల్సీ ఎన్నికలతో ముడిపడినదే అయినప్పటికీ, బీజేపీని తిట్టిన కొద్ది గంటలకే పవన్ కు ఈసీ నుంచి నోటీసులు వెళ్లాయంటూ ప్రచారం జరగడం చర్చనీయాంశమైంది. ఆదివారం నాటి పవన్ వ్యాఖ్యలతో ఇక బీజేపీతో జనసేన కలిసుండలేదని, తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ కమలంతో జనసేనాని విడాకులు తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications