సినిమా హాల్స్ మూసివేత వార్తలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి తలసాని: ఇప్పటికే రోడ్డున పడ్డారు..
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగిపోతోంది. మూడు వేలకు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా దాదాపు అన్ని జిల్లాల్లోనూ కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో దీని తీవ్రత అధికంగా ఉంటోంది. తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని కొన్ని జిల్లాలో రోజూ రెండంకెల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 431 పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదు కాగా.. అందులో అత్యధికం హైదరాబాద్‌లోనివే.

సినిమా థియేటర్లపై
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కరోనా వైరస్ కట్టడికి చర్యలను తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు మూసివేసింది. వైద్య విద్యాసంస్థలు మినహా అన్ని రకాల కళాశాలలు, పాఠశాలలకు బుధవారం నుంచే తాళాలు పడ్డాయి. దీనితో ఇక సినిమా థియేటర్లు కూడా మూతపడతాయంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఒకే సమయానికి వందలాది మంది గుమికూడే ప్రదేశం కావడం వల్ల సినిమా హాళ్ల ద్వారా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఫలితంగా- రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లను మూసివేసేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనేది ఆ వార్తల సారాంశం.

యధావిధిగా
ఈ వార్తలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. థియేటర్ల మూసివేతపై స్పష్టత ఇచ్చారు. థియేటర్లను మూసివేయట్లేదని తెలిపారు. తమ ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా థియేటర్లు యధావిధిగా నడుస్తాయని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో థియేటర్లు మూతపడనున్నాయంటూ సాగుతున్న ప్రచారం అబద్దమని తేల్చేశారు. సినిమా థియేటర్ల మూసివేత పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

వేలాదిమందికి ఉపాధి..
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చిత్ర పరిశ్రమ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న అనేకమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తలసాని అన్నారు. ఈ రంగంపై ఆధారపడిన వివిధ విభాగాలలోని కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని చెప్పారు. సినిమా హాళ్ల యజమానులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పాటించాల్సి ఉంటుందని సూచించారు. చిత్రపరిశ్రమ వేలాదిమందికి ఉపాధిని కల్పిస్తోందని, కరోనా మహమ్మారి వల్ల గత ఏడాది విధించిన లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే వారంతా రోడ్డున పడ్డారని చెప్పారు.
అందరి ప్రయోజనాల కోసమే..
చిత్ర పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తోన్న లక్షలాది మంది ఉపాధిని దృష్టిలో ఉంచుకుని థియేటర్లను యధావిధిగా కొనసాగిస్తామని అన్నారు. మూసివేస్తారంటూ వస్తోన్నారంటూ వస్తోన్న వార్తలు వట్టి వదంతులేనని మంత్రి తలసాని కొట్టి పారేశారు. వాటిని నమ్మొద్దని సూచించారు. కరోనా ప్రొటోకాల్స్, మార్గదర్శకాలకు అనుగుణంగా థియేటర్లు పని చేస్తాయని స్పష్టం చేశారు. అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని థియేటర్లను బంద్ చేయబోమని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications