Ponguleti Srinivas Reddy: తెలంగాణ పాలిటిక్స్ లో 'పొంగులేటి' గేమ్ ఛేంజర్ !

Ponguleti Srinivas Reddy:తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ? తన పేరులో తెలంగాణకు బదులుగా భారత్ అని మార్చుకున్న అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించేనా? లేదంటే డబుల్ ఇంజన్ సర్కారు అని నినదిస్తూ హస్తినలోనే కాదు ఇక తెలంగాణ‌లోనూ పాగా వేస్తామంటున్న బిజెపి ఆశలు ఫలించేనా? ప్ర‌త్యేక‌ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ వరుసగా రెండు పర్యాయాలు నెగ్గలేకపోయిన కాంగ్రెస్ మూడో ప్రయత్నంలో అయినా గెలిచేనా? అనేవి సగటు ఓటరులో ఉన్న సందేహాలు.

వరుసగా రెండు దఫాలు గెలిచి, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎనిమిదిన్నరేళ్లుగా పాలన సాగిస్తున్న కేసిఆర్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ప్రబలుతోందని ఒపీనియన్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైంది, ఆ పార్టీ నేతలు పలువురు బిజెపిలో చేరుతున్నారు, కాబట్టి ఇక హస్తం పార్టీ ఎంత మాత్రం బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాదనేది పరిశీలకుల విశ్లేషణ. బిజెపి వేగంగా పుంజుకుంటున్నప్పటికీ బీఆర్ఎస్ ను ఓడించేంతగా రాష్ట్ర వ్యాప్తంగా కమలం పార్టీ ఇంకా బలపడలేదనేది పొలిటిక‌ల్ టాక్.

Ponguleti Srinivas Reddy

పొంగులేటి పయనమెటు..?
ఈ నేపధ్యంలో అధికార బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతల్లో కీలకమైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ‌ర్గం పయనమెటు వైపు అనేది ఆసక్తికరం. 2014 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం ఎంపీగా వైఎస్సార్సీపీ త‌ర‌ఫున సంచ‌ల‌న విజ‌యం సాధించిన పొంగులేటి ఆ త‌ర్వాత త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో త‌న అనుచ‌రుల‌తో క‌లిసి బీఆర్ఎస్ లో చేరారు. 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో వైఎస్సార్సీపీ ఖ‌మ్మంలో మిన‌హా మ‌రెక్క‌డ త‌న ప్ర‌భావాన్ని చూప‌లేక‌పోయింది.

పిఎస్ఆర్ నాయ‌క‌త్వ సామ‌ర్ధ్యం వ‌ల్లే ఆయ‌న ఎంపీగా గెల‌వ‌డ‌మే కాకుండా అశ్వ‌రావు పేట‌, వైరా, పిన‌పాక అసెంబ్లీ స్ధానాల్లో త‌న పార్టీ అభ్య‌ర్ధుల‌ను గెలిపించుకున్నారు. అప్ప‌టికే జిల్లాలో బ‌లంగా ఉన్న కాంగ్రెస్-సిపిఐ, టిడిపి-బిజ‌పి కూట‌మి, టిఆర్ఎస్ ల‌ను దీటుగా ఎదుర్కొనేందుకు సిపిఎంతో జ‌త‌క‌ట్ట‌డం, జ‌రిగిన‌ చ‌తుర్ముఖ పోటీలో మూడు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీట్లు నెగ్గ‌డం అనేది పొంగులేటి రాజ‌కీయ చ‌తుర‌త‌కు, వ్యూహ‌ప‌టిమ‌కు, ప‌దునైన ఎత్తుగ‌డ‌ల‌కు నిద‌ర్శ‌నం.

ఈ ఎన్నిక‌ల్లో సిపిఎంతో వైఎస్సార్సీపీ పొత్తు ఒక్క ఖ‌మ్మం జిల్లాకే ప‌రిమిత‌మ‌వ‌డం కూడా పిఎస్ఆర్ రాజ‌కీయ సామ‌ర్ధ్యానికి అద్ధం ప‌డుతోంది. ఆ ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసిన నేత‌లు స‌త్తుప‌ల్లి, కొత్త‌గూడెం అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో రెండో స్ధానంలో ఖ‌మ్మంలో మూడో స్ధానంలో నిల‌వ‌డం అనేది పొంగులేటి రాజ‌కీయ బ‌లానికి నిద‌ర్శ‌నం. అప్ప‌టి నుంచి పొంగులేటి గెలిచే నాయ‌కుడే కాదు త‌న అనుచ‌రుల‌ను కూడా గెలిపించే నేత అని నిరూపించుకున్నారు.

Ponguleti Srinivas Reddy

రాజ‌కీయ దురంధ‌రుడైన పొంగులేటి సిఎం కేసిఆర్ ఆహ్వానం మేర‌కు, తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల పరిర‌క్ష‌ణ కోసం 2016 మే మొద‌టి వారంలో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు.బిఆర్ఎస్ లో చేరిన త‌ర్వాత పిఎస్ఆర్ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ త‌న‌దైన రాజ‌కీయ శైలితో రాణించారు. అయితే పొంగులేటి జ‌నాద‌ర‌ణ పొందుతుండ‌డంతో జీర్ణించుకోలేని కొంద‌రు బిఆర్ఎస్ పెద్ద నేత‌లే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా గ్రూపు రాజ‌కీయాలు చేశారని పొంగులేటి ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిఆర్ఎస్ ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ఒక సీటు నెగ్గి తొమ్మిది చోట్ల ఓట‌మి పాలైంది.

పొంగులేటికి జనాదరణ ఎలా ఉంది..?
దాంతో 2019 లోక‌స‌భ ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎంపీ అయిన పొంగులేటిని కాద‌ని సిఎం కేసిఆర్ టిడిపి నుంచి నామా నాగేశ్వ‌ర‌రావును తీసుకుని టికెట్ ఇచ్చారు. అయినా పిఎస్ఆర్ నిరాశ ప‌డ‌కుండా పార్టీ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేసి ఎంపీగా నామాను గెలిపించారు. కానీ ఇలా పార్టీలోనే కొన‌సాగిన సిట్టింగ్ ఎంపీల‌ను కాద‌ని టికెట్లు ఇచ్చిన మ‌ల్కాజిగిరి, న‌ల్గొండ లోక‌స‌భ సెగ్మెంట్ల‌లో బీఆర్ఎస్ ఓట‌మి పాలైంది.

Ponguleti Srinivas Reddy

ఇదిలా ఉంటే ఖ‌మ్మం లోక‌స‌భ సీటును బీఆర్ఎస్ గెల‌వ‌డమ‌నేది ముమ్మాటికీ పొంగులేటి కృషి ఫ‌లిత‌మే అనేది పార్టీ వ‌ర్గాల మాట‌. బీఆర్ఎస్ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ గ‌త నాలుగేళ్లుగా పిఎస్ఆర్ కు ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంపై గులాబీ నేత‌ల్లోనే అసంతృప్తి ఉంది. ప‌ద‌వి లేక‌పోయినా పొంగులేటి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ప‌నిచేయ‌డంతో ఆయ‌నకున్న పొలిటిక‌ల్ చ‌రిష్మా, జ‌నాద‌ర‌ణ ఏమాత్రం త‌గ్గ‌లేదు స‌రిక‌దా ఆయ‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి.

దాంతో ఇపుడు ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలోని ప‌ది అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో పొంగులేటికున్న అనుచ‌ర‌గ‌ణం మ‌రింత బ‌ల‌ప‌డింది. గ‌తంలో ప్ర‌త్య‌ర్ధుల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చిన నేత‌లే ఇపుడు శీన‌న్న అనుచ‌రులుగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు సిద్ద‌ప‌డుతున్నారు. మ‌రి పొంగులేటి శిబిరం దారెటు ... కాంగ్రెస్సా, క‌మ‌లం పార్టీనా అనేది ఇపుడు రాజకీయ వ‌ర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం.

జంపింగ్‌లతో బీఆర్ఎస్‌కు నష్టం వాటిల్లిందా..?
అధికార బీఆర్ఎస్ లో ఇపుడు గ‌ట్టిగా ధిక్కార స్వ‌రాన్ని వినిపిస్తున్న నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక్క‌రే. అంత‌కు ముందు 2021 జూన్ లొ బీఆర్ఎస్ కు ఈట‌ల రాజేంద‌ర్ రూపంలో అస‌మ్మ‌తి దెబ్బ‌ త‌గిలింది. బీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన రాజేంద‌ర్ వెంట కొందరు గులాబీ నేత‌లు ర్యాలీ అవుతార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేసాయి. కానీ ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ జిల్లా పరిష‌త్ మాజీ చైర్ ప‌ర్స‌న్ తుల ఉమ వంటి నేత‌లు మిన‌హా బ‌ల‌మైన నాయ‌కులెవ‌రూ రాజేంద‌ర్ వెంట బిజెపిలో చేర‌లేదు.

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీఆర్ఎస్ టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో మాజీ మంత్రి కొండా సురేఖ తిరిగి కాంగ్రెస్ లో, మ‌రో మాజీ మంత్రి బాబూ మోహ‌న్, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ బిజెపిలో చేరారు. ఇక 2019 లోక‌స‌భ ఎన్నిక‌ల‌ సంద‌ర్భంగా బీఆర్ఎస్ టికెట్ ద‌క్క‌ని నేత‌లు ఏపీ జితేంద‌ర్ రెడ్డి బిజెపిలో, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈ ప‌రిణామాలేవీ అధికార బీఆర్ఎస్ ను పెద్ద‌గా న‌ష్ట‌ప‌ర‌చ‌లేదు.

Ponguleti Srinivas Reddy

ఇటీవ‌ల మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సంద‌ర్భంగా భువ‌న‌గిరి మాజీ ఎంపీ బూరా న‌ర్స‌య్య గౌడ్ బీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరారు. ఇలా బూర న‌ర్స‌య్య గౌడ్ మాదిరే ప‌లువురు బీఆర్ఎస్ నేత‌లు అసంతృప్తితో ఉన్నారు. అదే సమయంలో మంచి అవ‌కాశం కోసం వేచి చూస్తున్నారు. వారిలో కొంద‌రైనా ధైర్యం చేసి త‌మ అసంతృప్తిని వ్య‌క్తపరిచేందుకు సిద్ద‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. అలాంటి వారిపుడు స‌రిగ్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆస‌రాగా చేసుకునే ఆస్కార‌ముంది.

టికెట్ దక్కకుంటే ఇతర పార్టీల వైపు
రాజ‌కీయాల్లో ఒంట‌రిగా ధైర్యం చేయ‌లేని వారు స‌మూహంలో నిలిచేందుకు వెన‌కాడ‌క‌పోవ‌చ్చు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ టికెట్ ద‌క్క‌క‌పోతే ఇత‌ర పార్టీల్లో చేరి అయినా పోటీ చేయాల‌నుకునే నేత‌లు సుమారు 50 మంది వ‌ర‌కు ఉంటార‌ని ఎన్నిక‌ల స‌ర్వేలు నిర్వ‌హిస్తున్న సంస్ధ‌ల అభిప్రాయం. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా కొన్ని నెల‌లు మాత్ర‌మే ఉండ‌డంతో బీఆర్ఎస్ ఆశావ‌హుల్లో కొంద‌రు ఇపుడు పిఎస్ఆర్ వెంట న‌డిచి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకుంటున్న‌ట్టు స‌మాచారం.

అదే జ‌రిగితే పొంగులేటి శిబిరం బ‌లం రాజ‌కీయంగా మ‌రింత పెర‌గ‌డానికి ఆస్కార‌ముంటుంది.గ‌తంలో రెండేళ్ల పాటు వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన పొంగులేటికి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక‌, రాజ‌కీయ ప‌రిస్ధితులు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉంది. ఇలా ప‌లు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి ప్ర‌త్య‌ర్ధుల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చే అనుచ‌ర‌గ‌ణమున్న శీన‌న్న తెలంగాణ రాజ‌కీయాల్లో గేమ్ ఛేంజ‌ర్ అయినా ఆశ్చ‌ర్యం లేదు.

Ponguleti Srinivas Reddy:

గేమ్‌ ఛేంజర్ అంటే ఎవరు..?
ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అంతగా లేని పార్టీని విజయతీరాలకు చేర్చే అంశాన్ని గేమ్ ఛేంజర్ గా భావిస్తారు. మానిఫెస్టోలో ఇచ్చే హామీలు, ప్రత్యేక అజెండా, వ్యూహాలు, ఎత్తుగడలే రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ గా ఉంటాయి. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాలు కొన్ని సంద‌ర్భాల్లో ఒక పార్టీని పూర్తిగా స‌మ‌ర్ధించ‌డం వంటి అంశాలను గేమ్ ఛేంజ‌ర్ గా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. ఒక పార్టీలోని బ‌ల‌మైన నేత త‌న వ‌ర్గంతో వేరే పార్టీలో చేరి ఆ పార్టీ విజ‌యావ‌కాశాల‌ను పెంచి గేమ్ ఛేంజ‌ర్ గా గుర్తింపు పొందిన ఉదంతాలు భార‌త రాజ‌కీయాల్లో చాల‌నే ఉన్నాయి.

2016 లో జ‌రిగిన అసోం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అప్ప‌టి వ‌ర‌కు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను బిజ‌పి ఓడించి అధికారంలోకి వ‌చ్చింది. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న హిమంత బిశ్వ శ‌ర్మ హ‌స్తం పార్టీని వీడి బిజెపిలో చేర‌డం అనేది అసోం రాజ‌కీయాల్లో గేమ్ ఛేంజ‌ర్ అని మీడియా విశ్లేషించింది. ఆ శ‌ర్మ‌నే బిజెపి రెండోసారి 2021లో గెలిచిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి అయ్యారు.

ఇక 2021లో జ‌రిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అప్ప‌టి వ‌ర‌కు అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న సువేందు అధికారి బిజెపిలో చేరి సిఎం మ‌మ‌తా బెన‌ర్జీనే ఓడించ‌డం విశేషం. తృణ‌మూల్ కాంగ్రెస్ కు బిజెపి గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం వెన‌క ఉన్న నేత‌ సువేందు అధికారే అని, ఆయ‌నే బెంగాల్ పొలిటిక‌ల్ గేమ్ ఛేంజ‌ర్ అని అంద‌రికీ తెల్సిందే.

Ponguleti Srinivas Reddy

ఇపుడు తెలంగాణ రాజ‌కీయాల్లో అలాంటి గేమ్ ఛేంజ‌ర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినే అని పొలిటిక‌ల్ టాక్.హిమాన్షు, సువేందు మాదిరే స‌రిగ్గా పిఎస్ఆర్ కూడా అధికార బిఆర్ఎస్ ను వీడుతున్నార‌ని, ఆయ‌నే ఇపుడు తెలంగాణ పొలిటిక‌ల్ గేమ్ ఛేంజ‌ర్ అనేది రాజ‌కీయ వ‌ర్గాల విశ్లేష‌ణ‌. పొంగులేటి వెంట బ‌ల‌మైన అనుచ‌రగ‌ణం, సామాజిక వ‌ర్గ‌ముంద‌ని, అర్ధ‌, అంగ బ‌ల‌మున్న ఆయ‌న ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యావ‌కాశాలు మెరుగుప‌డ‌తాయ‌నేది పొలిటిక‌ల్ టాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+