Telangana election polling: ఓటు వెయ్యకుంటే జైలుశిక్ష, జరిమానా విధించండి సర్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు చాలా ప్రాంతాలలో ఓటింగ్ మందకొడిగా సాగుతుంది. ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ, చాలా ప్రాంతాలలో పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుంది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మొదటి రెండు గంటల్లో పోలింగ్ శాతం కాస్త తగినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు నెటిజన్లు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోకపోవడం కొంతమందిని అసహనానికి గురిచేస్తుంది.

విద్యావంతులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో కొన్ని దేశాలలో ఓటు వెయ్యకుంటే జరిమానా విధించే పద్ధతి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు తెలంగాణ ఓటర్లు. ఆస్ట్రేలియాలో, బెల్జియంలో ఓటు వేయకపోతే జరిమానా విధిస్తున్నారని, గ్రీసు, ఈజిప్టు వంటి దేశాలలో జైలు శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నారు.
ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు నెటిజన్లు ఓటు హక్కు వినియోగించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆస్ట్రేలియా వంటి దేశంలో ఓటు వేయని వారికి ఆ దేశ కరెన్సీ ప్రకారం 20 డాలర్ల జరిమానా విధిస్తారని, గ్రీసు ఈజిప్టు వంటి దేశాలలో ఓటు వేయని వారిపై ప్రత్యేక విచారణ చేపడతారని, సరైన కారణం చెప్తే హెచ్చరించి వదిలేస్తారని అంటున్నారు.
సరైన కారణం లేకుండా ఓటు వేయలేదు అని తెలిస్తే జైలు శిక్ష విధిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో సైతం అందరూ ఓటు వేయాలంటే ఇలాంటి శిక్షలు తీసుకు రావలసిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి పలువురు చైతన్యవంతమైన ఓటర్లు సూచిస్తున్నారు. ఓటింగ్ తప్పనిసరి అనే నిబంధన తీసుకురావాలని అంటున్నారు.












Click it and Unblock the Notifications