ప్రొఫెసర్ హరగోపాల్ తోపాటు 152 మందిపై దేశ ద్రోహం కేసు: ఆయన ఏమన్నారంటే.?
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన ఘాటుగా స్పందించారు. తనతోపాటు 152 మందిపై ఉపా చట్టం కింద కేసు పెట్టడం దుర్మార్గమన్నారు హరగోపాల్. 'పోలీసుల అత్యుత్సాహంతోనే నాపై ఉపా చట్టం కింద కేసు పెట్టారు. ప్రభుత్వ పెద్దలకు తెలిసి నాపై కేసు నమోదైందని అనుకోవడం లేదు' అని హరగోపాల్ తెలిపారు.
అంతేగాక, 'నేను ఏ మావోయిస్టును కలిశానో.. ఎక్కడ సమావేశమయ్యానో డీజీపీ చెప్పాలి. తెలంగాణలో మావోయిస్టులే లేరన్న డీజీపీ ఎక్కడ సమావేశమయ్యారో చెప్పాలి. నాపై నమోదైన కేసుపై పౌరసమాజం స్పందించిన తీరు సంతృప్తినిచ్చింది. ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా నాపై పెట్టిన కేసును వ్యతిరేకిస్తున్నారు. ఇది పోలీసుల అత్యుత్సాహం కావొచ్చు' అని హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రొఫెసర్ హరగోపాల్‌పై యూఏపీఏ కింద కేసు పెట్టడంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. హరగోపాల్‌పై దేశద్రోహం కేసు పెట్టడంపై కాంగ్రెస్ నేత మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ కేసును ఆయనపై తొలగించాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల నేతలు కూడా హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై మండిపడుతున్నాయి. హరగోపాల్ పై దేశద్రోహం కేసు పెట్టడం దుర్మార్గమని అంటున్నారు. ఇప్పటికైనా ఆ కేసును వెనక్కి తీసుకోవాలంటున్నారు.
కాగా, 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద హరగోపాల్ పై కేసు నమోదు చేశారు. యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద హరగోపాల్ తో పాటు 152 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరుందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications