ఏపీకి వంత పాడతారా, శ్రీశైలం అంగీకారాన్ని వెనక్కి తీసుకుంటున్నాం: తెలంగాణ షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుపై తెలంగాణ తీవ్రంగా ధ్వజమెత్తింది. బోర్డు పక్షపాతంగా వ్యవహరిస్తోందని, పనితీరు అధ్వాన్నంగా ఉందని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బోర్డు పని తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు బోర్డు వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని పేర్కొంటూ ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సోమవారం లేఖ రాశారు.

 మూడేళ్లుగా ఇదే పద్ధతి

మూడేళ్లుగా ఇదే పద్ధతి

కృష్ణా నది యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) ఆంధ్రప్రదేశ్‌ పక్షపాతి అని, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తోందని, బోర్డు చేతగానితనం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ తమ ఫిర్యాదులో తెలంగాణ పేర్కొంది. బోర్డు వ్యవహార శైలిని సరిదిద్దాలని కోరింది. గత మూడేళ్లుగా బోర్డు వ్యవహరిస్తున్న తీరును లేఖలో ప్రస్తావించారు.

 హరీష్ రావు లేఖలో ఇలా

హరీష్ రావు లేఖలో ఇలా

'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణం నీటి అంశం కూడా. తెలంగాణ వాటా ప్రకారం నీరు వస్తుందని ప్రజలు ఆశించారు. కానీ, రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాను తేల్చడానికి ఏర్పాటైన కమిటీ ఎటువంటి సిఫారసులూ చేయలేదు. దీనిపై కృష్ణా బోర్డు సరైన నిర్ణయాలు తీసుకోవడంలేదు. ఈ పరిస్థితిని ఏపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. దాంతో రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తుతున్నాయి.' అని పేర్కొన్నారు.

ఏపీకి ఎక్కువ నీరు ఉపయోగిస్తున్నా

ఏపీకి ఎక్కువ నీరు ఉపయోగిస్తున్నా

ఈ ఏడాది శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు అవసరమైన నీటి విడుదలలో బోర్డు విఫలమయిందని, పోతిరెడ్డిపాడు నుంచి కేటాయించిన నీటి కంటే ఎక్కువ నీటిని ఏపీ ఉపయోగిస్తున్నా బోర్డు నియంత్రించలేకపోతోందని, కానీ, శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా గ్రిడ్‌ అవసరాలను తీర్చడంతోపాటు, సాగర్‌కు నీటి విడుదలతో తాగునీటి ఎద్దడిని అధిగమించే అవకాశమున్నా తెలంగాణను తప్పుబడుతోందని లేఖలో పేర్కొన్నారు.

శ్రీశైలం నీటిమట్టంపై అంగీకారం ఉపసంహరణ

శ్రీశైలం నీటిమట్టంపై అంగీకారం ఉపసంహరణ

శ్రీశైలంలో కనీస నీటిమట్టం నిర్వహిస్తామని గతంలో ఇచ్చిన అంగీకారాన్ని ఉపసంహరించుకుంటున్నామని ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం నిర్వహిస్తామని గతంలో తెలంగాణ అంగీకరించింది. ఇప్పుడు దీనిని ఉపసంహరించుకున్నట్లు తెలిపి షాకిచ్చింది. కృష్ణా బోర్డు ఏర్పడి మూడు సంవత్సరాలైందని, ఈ బోర్డు పటిష్ఠంగా పని చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా జలాలపై బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణ జరుపుతోందని, ట్రైబ్యునల్‌ తేల్చేవరకు తెలంగాణ 299, ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీలు వినియోగించుకునేలా కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ వద్ద 2015లో జరిగిన సమావేశంలో అంగీకారం కుదిరిందని, తర్వాత సంవత్సరాల్లో కూడా ఇది కొనసాగుతోందన్నారు.

నాగార్జున సాగర్‌ను కాదని శ్రీశైలంలో సరికాదు

నాగార్జున సాగర్‌ను కాదని శ్రీశైలంలో సరికాదు

ఈనెల 7 నాటికి శ్రీశైలం నీటిమట్టం 883 అడుగులు ఉందని, పూర్తి స్థాయి నీటిమట్టానికి రెండు అడుగులు మాత్రమే తక్కువ ఉందని, ఇంకా ప్రవాహం వచ్చే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. అయినా బోర్డు ఆదేశాల మేరకు మేం ఎడమ విద్యుత్తు కేంద్రం నుంచి నీటి విడుదల నిలిపివేయగా, ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేస్తూనే ఉందని పేర్కొన్నారు. గత మూడేళ్లలో నష్టపోయిన నాగార్జునసాగర్‌ ఆయకట్టు అవసరాలకు శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం నడపడం తెలంగాణకు తప్పనిసరి అన్నారు. దీంతోపాటు శ్రీశైలంలో 854 అడుగులు నిర్వహించడానికి గతంలో ఇచ్చిన అంగీకారాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నామని, రెండు రాష్ట్రాల అవసరాలకు 264 టీఎంసీల వినియోగం ఉన్న నాగార్జునసాగర్‌ను కాదని శ్రీశైలంలో ఉంచడం సరికాదన్నారు.

 ఏపీ అసంబద్ధ నిర్ణయాలకు వంత

ఏపీ అసంబద్ధ నిర్ణయాలకు వంత

తెలంగాణ ఏర్పడటానికి నీరొక ప్రధాన కారణమని, పరివాహక ప్రాంతం, లభ్యతను బట్టి తమ వాటా రావాలన్నది ప్రజల డిమాండ్‌ అని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఈ అంశాలపై విశ్లేషణ చేయించి వివిధ అవసరాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉందన్నారు. ఎలాంటి సిఫార్సులు చేయకుండానే బజాజ్‌ కమిటీ గడువు ముగిసిందని లేఖలో వివరించారు. బాధ్యత గల కృష్ణా బోర్డు కొన్ని సమయాల్లో పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఏపీ తీసుకొనే అసంబద్ధ నిర్ణయాలకు వంతపాడుతోందని, దీనివల్ల సమస్యలకు దారి తీసే అవకాశం ఉందంటూ అంశాలవారీగా వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Irrigation minister T. Harish Rao on Monday withdrew the state government’s consent to maintain the water level at 854 feet at the Srisailam dam and accused the Krishna River Manag-ement Board (KRMB) of discriminating against the state by not ensuring early release of water from Srisailam to the Nagarjunasagar dam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి