తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా... కొత్తగా 7432 కేసులు,33 మంది మృతి...
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మొన్న రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం(ఏప్రిల్ 23) రాత్రి 8 గంటల వరకు రికార్డు స్థాయిలో 7432 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 33 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం(ఏప్రిల్ 24) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
హెల్త్ బులెటిన్ ప్రకారం... మరో 5136 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,87,106కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,961కి చేరింది. ప్రస్తుతం 58,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2157 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,26,997కి చేరింది.

ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.1శాతం ఉండగా... తెలంగాణలో 0.51శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 83.5 శాతం ఉండగా తెలంగాణలో 86.16 శాతం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1464 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,23,84,797 కరోనా టెస్టులు నిర్వహించారు.
కాగా,దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగిస్తోన్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు శుక్రవారం(ఏప్రిల్ 23) బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయల్దేరి వెళ్లాయి.ఈ యుద్ధ విమానాల్లోని 8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు. యుద్ధ విమానాలను ఉపయోగించడం ద్వారా మూడు రోజుల సమయం ఆదా అవడంతో పాటు, ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఇది దోహదపడుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
గత 3,4 రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుత అవసరానికి అది సరిపోవట్లేదు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు కేంద్రం రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది. ఇందులో 70 టన్నుల వరకు తెలంగాణలోనే పలు ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి అందించనున్నారు. మిగిలిన ఆక్సిజన్‌ను బళ్లారి, భిలాయ్, అంగుల్ (ఒడిశా), పెరంబుదూర్ నుంచి తీసుకోవాలని కేంద్రం సూచించింది. అయితే తెలంగాణకు సమీపంలోని బళ్లారి స్టీల్ ప్లాంట్ నుంచి కేటాయించింది కేవలం 20 టన్నులే. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కూడా దాదాపుగా అంతే కేటాయించారు. దూరంగా ఉన్న ప్లాంట్ల నుంచి ఎక్కువ ఆక్సిజన్‌ను కేటాయించడంతో తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాల సేవలు వాడుకుంటోంది.












Click it and Unblock the Notifications