కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ టెక్కీ మృతి, మరో ముగ్గురు మహిళలకు గాయాలు
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గద్వాల జిల్లా కేటీ దొడ్డికి చెందిన గోపాల్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా అక్కడేవుండిపోయిన అతడు గురువారం ఉదయం స్వగ్రామానికి వెళ్లేందుకు మరో ముగ్గురు మహిళలతో కలిసి కారులో బయల్దేరాడు.

కాగా, రాయచూర్ జిల్లా మాన్వి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తోపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గోపాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే, ఆ మహిళలు గోపాల్ కుటుంబ సభ్యులా? లేక తోటి ఉద్యోగుల అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రమాదంపై సమాచారం అందున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాయచూర్ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. ప్రమాదంపై మృతులు, క్షతగాత్రుల కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications