అలర్ట్ : తెలంగాణలో రాబోయే 3 రోజులు మండిపోనున్న ఎండలు...
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు పట్టణాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. రాబోయే మూడు రోజులు 5,6,7తేదీల్లో ఎండలు తీవ్రంగా ఉండనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మూడు రోజులు మహారాష్ట్రలోని విదర్భ నుంచి వడగాలులు వీస్తాయని... దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఆదివారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. కాబట్టి ఆరోజు మధ్యాహ్నం 12గంటల నుంచి 3 గంటల మధ్య ప్రజలు ఇంటి పట్టునే ఉండాలని సూచించింది. ముఖ్యంగా చిన్నపిల్లలు,దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆ సమయంలో బయటకు వెళ్లవద్దని,జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

రాష్ట్రంలో శనివారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాలలో 43.5 డిగ్రీలు, నల్లగొండలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.
ఈ ఏడాది మార్చి నెల నుంచే తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఆదిలాబాద్,మంచిర్యాల,కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మార్చిలోనే 42 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి,జగిత్యాల,నిజామాబాద్ జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చిలోనే ఇంత ఉష్ణోగ్రతలు నమోదవడంతో... ఏప్రిల్,మే నెలల్లో ఈసారి ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆదిలాబాద్,మంచిర్యాల,కుమ్రం భీమ్ ఆసిఫాబాద్,జయశంకర్ భూపాలపల్లి,ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,కరీంనగర్,ఖమ్మం,నల్గొండ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.