TET: మిర్యాలగూడలో మాల్ ప్రాక్టీస్: అభ్యర్థి, ఇన్విజిలేటర్ అరెస్ట్, సిరిసిల్లలో మారిన పేపర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన టెట్ పేపర్-1 పరీక్షకు 2,26,744 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్-2కు 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
కాగా, నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కృష్ణవేణి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పేపర్-1లో మాల్ ప్రాక్టీసింగ్ జరిగింది. మాల్ ప్రాక్టీసింగ్ కు పాల్పడిన అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అభ్యర్థి తనీష్ ఖనంకు సహకరించిన ఇన్విజిలేటర్ వారిఫ్ ముజారీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మిర్యాలగూడ రెండో పట్టణ పోలీసులు ఇద్దరిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో ఒక ప్రశ్నపత్రానికి బదులుగా మరొకటి ఇవ్వడంతో అభ్యర్థులు గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెట్ పరీక్ష సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ప్రశ్నపత్రానికి బదులుగా మరొకటి అందజేసి నిరుద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడం క్షమించరాని నేరమని బండి సంజయ్ అన్నారు. పరీక్షలు కూడా సరిగా నిర్వహించడం చేతగాని ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోందని విమర్శించారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ, టెన్త్ పేపర్ లీకేజీతోనే లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. ఈ ఉదంతం మరువకముందే టెట్ ప్రశ్నపత్రం మార్పు పేరుతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. నిత్యం ప్రతిపక్షాలపై బురద జల్లుతూ రాజకీయ పబ్బం గడిపే మంత్రి కేటీఆర్.. సొంత జిల్లాలో అధికారులు చేసిన నిర్వాకంపై ఎందుకు నోరు మెదపడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకవోడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications