ఆ పని చేస్తూ అడ్డంగా దొరికి.. తెలంగాణా యూనివర్సిటీ ఇజ్జత్ తీసిన వీసీ!!
తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డాడు. తెలంగాణ యూనివర్సిటీ పరువును నిలువునా తీశారు. ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీలో వీసీ లంచావతారం పై గత కొంత కాలంగా బాహాటంగా ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ అవేవీ పట్టనట్టుగా చెలరేగిపోయిన వీసీ రవీందర్ గుప్తా 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
ఈరోజు ఉదయం తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా తార్నాకలోని తన నివాసంలో ఒక కళాశాలకు సెంటర్ కేటాయింపు విషయంలో 50వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న క్రమంలో దాడి చేసిన ఏసీబీ అధికారులు అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని మాస్టర్ బెడ్ రూమ్ బీరువా నుండి లంచం తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేసిన అధికారులు, ఆ డబ్బుపై ఉన్న వేలిముద్రల ఫోరెన్సిక్ టెస్ట్ నిర్వహించారు.

ఇది సానుకూల ఫలితాన్ని ఇవ్వడంతో ఆయనపై చర్యలకు ఉపక్రమించారు. యూనివర్సిటీ వీసీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత రోజు నుంచి ప్రొఫెసర్ రవీందర్ గుప్తా యూనివర్సిటీ లో ప్రతి పోస్ట్ కి ఒక రేట్ ఫిక్స్ చేసి వసూళ్ల పర్వం మొదలు పెట్టారు. తాను మూడు కోట్లు వెచ్చించి వీసీగా వచ్చానని, తన డబ్బు తాను తిరిగి సంపాదించుకోవాలని ఆయన పలువురితో చెప్పినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నియామకాల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని, నిధులు దుర్వినియోగం చేశారని ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువగా మారాయి. నిన్నటికి నిన్న ఉద్యోగాల పేరుతో డైలీ వేజ్ కింద తమను పనిలోకి చేర్చుకున్నారని, ఇందుకోసం రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వీసీ రవీందర్ గుప్తా డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని వీసీ కాళ్లు పట్టుకుని బాధితులు వేడుకున్నారు.
ఇన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ రవీందర్ గుప్తా తన పంథాను మార్చుకోకుండా లంచాలను తీసుకోవడంతో ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. ఆ ట్రాప్ లో చిక్కుకున్న రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ క్రమంలో ఆయనను యూనివర్సిటీ వీసీగా సస్పెండ్ చేసి, ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications