వినోద ఆత్మహత్యకు రద్దైన నోట్లు కారణం కాదు: ఆమె కూతుళ్లు
మహబూబాబాద్: జిల్లాలోని శనిగపురంకు చెందిన వినోద(55) అనే మహిళ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలిసింది. మొదట కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 500, 1000 నోట్ల కారణంగానే ఆందోళన చెంది విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా, డబ్బు విషయంలో కొడుకు వచ్చిన విభేదాలే ఆమె ఆత్మహత్యకు కారణమని తేలింది. కుమార్తె పెళ్లి కోసం ఆమె కుటుంబానికి చెందిన 12 ఎకరాల భూమిని అమ్మేసింది. దీంతో ఆమెకు రూ. 55 లక్షలు వచ్చాయి. అయితే దీన్ని ఆమె కొడుకు వ్యతిరేకించాడు.

భూమి అమ్మగా వచ్చిన మొత్తం తనకే కావాలని అతడు పట్టుపట్టాడు. దీంతో కుటుంబంలో కలహాలు చెలరేగాయి. దీంతో మనస్తాపానికి గురైన వినోద ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుమార్తెలు పోలీసులకు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబసభ్యులను విచారిస్తున్నట్లు జిల్లా కమిషనర్ ప్రీతి నినా తెలిపారు. రద్దు చేసిన నోట్ల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తప్పుగా ప్రచారం జరిగిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications