jagan and kcr: తెలుగు నిర్మాతల కీలక సమావేశం?
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం థియేటర్ టికెట్ ధరలను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. నిర్మాతల కోరిక మేరకు పెద్ద సినిమాలకు పెంచుకోవడానికి అనుమతిచ్చింది. అలాగే తెలంగాణలోను టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అంతవరకు బాగానేవుందికానీ ఇప్పుడు మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలంతా అంత టికెట్ ధరలు వద్దు బాబోయ్.. సాధారణ ధరలుంటే చాలంటున్నారు.

ఇప్పుడే తత్వం బోధపడింది
తత్వం నిర్మాతలకు ఇప్పుడు బోధపడింది. సినిమా టికెట్ ధరలు పెంచడంవల్ల భారీ విజయాలను నమోదుచేసుకున్న ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి సినిమాలు కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఆస్థాయిలో టికెట్ ధరలకు విడుదల చేసుకున్నాయి. సినిమా ఫ్లాప్ అవడంతో ఆ సినిమాలవైపు తొంగిచూసే నాథుడు కూడా లేకుండా పోయాడు.

మల్టీప్లెక్స్ లో రూ.395
మల్టీ ప్లెక్స్ లో రూ.395 వరకు టికెట్ ఉంటే, సింగిల్ థియేటర్లలో రూ.195 వరకు ఉంటోంది. ఇంత ధర పెట్టి కుటుంబ సమేతంగా సినిమా చూడాలంటే ఒక్కో కుటుంబానికి రూ.2500 నుంచి రూ.3000 వరకు అవుతున్నాయి. దీనికన్నా ఓటీటీలో చూసుకోవచ్చులే అనే భావనతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. సినిమా పర్వాలేదు బాగుంది అనే టాక్ వచ్చినా ఎవరూ రావడంలేదు. దీంతో నిర్మాతలకు కలెక్షన్లు తగ్గిపోయాయి.

ప్రేక్షకులను దోపిడీ చేద్దామంటే ఎలా?
పెంచిన టికెట్ ధరలద్వారా అభిమానుల నుంచి భారీగా దోపిడీ చేద్దామని భావించిన నిర్మాత, కథానాయకులకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. మొదటిరోజు మొదటి ఆటకే ఫ్లాప్ అనే టాక్ వచ్చిందంటే చాలు ఎంత అగ్ర కథానాయకుడి సినిమా అయినా సరే థియేటర్లకు వెళ్లడం మానేశారు. టికెట్ ధరలు తక్కువగా ఉంటే కుటుంబ సమేతంగా సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు.
గతంలో సినిమా ఫ్లాప్ అయినా తక్కువగా ఉండే టికెట్ ధరలవల్ల ప్రేక్షకులు సినిమాలు చూసేవారు. ఎంతోకొంత నష్టం పూడిపోయేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. సినిమా ఫ్లాప్ అంటే చాలు.. ఓటీటీలో చూద్దాంలే అని ప్రేక్షకుడు నిర్ణయించేసుకుంటున్నాడు.

టికెట్ ధరల పెంపు వద్దు?
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలంతా సమావేశమవబోతున్నారు. టికెట్ ధరల పెంపు వద్దని, ఏ సినిమాకైనా థియేటర్లలో, మల్టీప్లెక్స్ ల్లో ఇప్పుడున్న సాధారణ ధరలనే కొనసాగనివ్వాలని కోరబోతున్నారు. త్వరలో విడుదల కానున్న ఎఫ్3 సినిమా కూడా ఇప్పుడున్న ధరలమీదే ఆధారపడదామనుకుంటోంది. ఏదేమైనప్పటికీ చలనచిత్ర పరిశ్రమలో వచ్చిన ఈ మార్పు ప్రేక్షకులు ఉపయోగపడేదే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.