యువ కథానాయకుడిని బెదిరించిన స్టార్ ప్రొడ్యూసర్?
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన యువ కథానాయకుడిని అగ్ర నిర్మాత బెదిరించినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నిర్మాత రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా కొనసాగుతున్నారు. కొద్దిరోజుల క్రితం సదరు నిర్మాత చిత్రం విడుదలైంది. అదేరోజు ఆ కథానాయకుడి సినిమా కూడా విడులవుతుందని ముందే సంబంధిత చిత్ర నిర్మాత, దర్శకుడు ప్రకటించారు. అయితే తన చేతిలో థియేటర్లు ఉండటం, ముందుగా ఆ సినిమా విడుదలై మంచి టాక్ వస్తే తర్వాత విడుదలయ్యే తన సినిమాకు ఒకవేళ డివైడ్ టాక్ వస్తే అన్ని విధాలుగా నష్టపోతామని భావించిన సదరు స్టార్ ప్రొడ్యూసర్ ఆ సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలంటూ చిత్ర యూనిట్‌తోపాటు కథానాయకుడిపై ఒత్తిడి తెచ్చారు.

ఒత్తిడి తేలేదు.. హుకుం జారీచేశారు
చిత్రయూనిట్ పై ఒత్తిడి తెచ్చారు అనేదానికన్నా వాయిదా వేసుకోవాలంటూ హుకుం జారీచేశారని చెప్పవచ్చని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలోకి రావడమే తరువాయి. కానీ స్టార్ ప్రొడ్యూసర్ బెదిరించడంతో తన కెరీర్ ఇన్నేళ్లలో ఏనాడూ ఒత్తిడికి గురవని కథానాయకుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గత నెలలో విడుదలవ్వాల్సిన ఆ సినిమాను నవంబరుకు వాయిదా వేశారు.

సినిమా విడుదల వాయిదా పడటంతో రూ.లక్షల్లో నష్టం
సినిమా బాగా వచ్చిందని, హిట్ అవుతుందని ఫిలిం నగర్ వర్గాల్లో కూడా వార్త వచ్చింది. ఈ సినిమా నవంబరుకు వెళ్లడంవల్ల నిర్మాతకు ప్రతిరోజు లక్షల రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. మూడునెలలకు పైగా సమయం ఉండటంతో సినిమాపై వచ్చి బజ్ తగ్గిపోతుందని ఆ కథానాయకుడు ఆందోళన చెందుతున్నారు. కథానాయకుడిని బెదిరింపులకు గురిచేయడం, తర్వాత సినిమాకు థియేటర్లను ఇవ్వని చెప్పడం ఇప్పుడు జరిగిన కొత్త సంఘటనేమీ కాదని, గతంలో కూడా పలువురు నిర్మాతలు ఈ తరహా ఘటనలను ఎదుర్కొన్నారని చెబుతున్నారు.

అన్నింటిపై అవగాహన ఉండి.. ఇలా వ్యవహరిస్తే ఎలా?
చిన్నస్థాయి నుంచి భారీ చిత్రాలు నిర్మించే నిర్మాతగా మారిన ఆయనకు చిన్న సినిమాల నిర్మాణం గురించి, అవి సకాలంలో విడుదలవకపోవడంవల్ల తలెత్తే నష్టాల గురించి అవగాహన ఉంటుంది. అన్నీ తెలుసుకొని, అన్నింటిపై అవగాహన ఉండి ఇలా ప్రవర్తించడం సరికాదని, థియేటర్లు చేతిలో ఉన్నాయికదా అని ఇలా తన సినిమాలకు పోటీగా వచ్చేవాటన్నింటినీ ఆపేస్తూ, సంబంధిత చిత్ర యూనిట్లను బెదిరించుకుంటూ వెళితే చివరకు ఏదో ఒకరోజు ఆయనకు కూడా ఇదే అనుభవం ఎదురవుతుందని ఫిలిం నగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.












Click it and Unblock the Notifications