ఒక్కరు ఎపి, ఒక్కరు తెలంగాణ: బెంగళూర్‌లో టెక్కీల డ్రగ్స్ వ్యాపారం
హైదరాబాద్: సోషల్ మీడియా ద్వారా మాదకద్రవ్యాల విక్రయం జరుపుతున్న ఇద్దరు తెలుగు టెక్కీల బాగోతం బయటపడింది. తెలంగాణలోని నిజామాబద్, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన ఇద్దరు టెక్కీలు బెంగళూరు ఆ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఫేస్‌బుక్‌లో ఓ పేజ్ క్రియేట్ చేసి దాని ద్వారా మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నారు.
సమాచారం అందుకున్న బెంగళూరు డిటెక్టివ్ క్రైమ్ బ్రాంచ్ (డిసిబి) అధికారులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి గురువారం ఇరువురిని అరెస్టు చేశారు. నిజామాబాద్‌కు ెచందిన శ్రీహరి (23), ఒంగోలుకు చెందిన కె. అర్జున్ (28) హైదరాబాద్‌లో చదువుకున్నప్పుడు మిత్రులయ్యారు.
బిటెక్ పూర్తి చేసిన ఈ ఇద్దరు ప్రస్తుతం ఉద్యోగం వేటలో ఉన్నారు. ఇందులో భాగంగా వారు బెంగళూరు వెళ్లి అక్కడి చలమట్ట ప్రాంతంలో పెయింగ్ గెస్ట్ అకామిడేషన్‌లో ఉంటున్నారు. హైదరాబాదులో ఉండగానే డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు కొన్నాళ్లకు వాటిని విక్రయించే పెడ్లర్స్‌గా మారారు.

హైదరాబాదులోని కొందరు హోల్ సేల్ గంజాయి వ్యాపారుల నుంచి బొమ్మలుండే స్టాంపుల రూపంలో ఉండే ఎల్ఎస్‌డీ (లినర్జిక్ యాసిడ్ థైలామెడ్) మాదక ద్రవ్యాలను సేకరిస్తున్నారు. వీటిని బెంగళూరులో విక్రయించడానికి శ్రీహరి ఏకంగా ఫేస్‌బుక్‌లో బెంగళూరు డీడ్ స్పోకెన్ పేరుతో పేజ్ ఏర్పాటు చేశాడు.
3,814 మంది లైక్ చేసి, ఫాలో అవుతున్న దీని ద్వారా ఆర్డర్లు స్వీకరిస్తూ అవసరమైనవారిని కలిసి మాదక ద్రవ్యాలు విక్రయించడం ప్రారంభించాడు. వీటి సరఫరా బాధ్యతలను అర్జున్ తీసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ఈ వ్యాపారంపై సమాచారం అందడంతో బెంగళూరు సిసిబి అధికారులు రంగంలోకి దిగారు.
వినియోగదారుల మాదిరిగానే తమకు డ్రగ్స్ కావాలంటూ పోస్టింగ్ పెట్టారు. దీనికి స్పందించిన శ్రీహరి కాంటాక్ట్ మీ అంటూ తన సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. సిసిబీకి చెందిన ఓ అధికారి స్వయంగా వినియోగదారుడి మాదిరిగా శ్రీహరిని ఫోనులో సంప్రదించాడు.
తనకు గంజాయి కావాలని చెప్పడంతో గురువారం కడుగోడి ప్రాంతానికి రావాలని శ్రీహరి నుంచి సమాధానం వచ్చింది. దీంతో అక్కడ వలపన్నిని పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న టెక్కీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతను ఇచ్చిన సమాచారంతో అర్జున్‌ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications