భానుడి భగభగ.. తెలంగాణాలోని ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్; వాతావరణశాఖ కీలక అప్డేట్!!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక రానున్న వారం రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు కీలక సూచనలు చేసింది. మార్చి 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని బయటకు రాకుండా ఉంటేనే మంచిదని సూచిస్తుంది.

ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్య బయటకు వెళ్లకపోవడమే మంచిదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
రేపటి నుంచి వడగాలులు కొనసాగుతాయని, పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. నిన్న జైనథ్, తలమడుగు మండలాలలో గరిష్టంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాలలో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రానున్న మూడు రోజులు కూడా ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల కంటే మరో రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications