వరంగల్ వాసుల్లో భయం భయం... గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ తీర్మానంపై చర్చ!
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతున్న క్రమంలో ప్రస్తుతం వరంగల్ జిల్లాలోనూ ముఖ్యంగా వరంగల్ నగరవాసులకు భయం పట్టుకుంది. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో వరంగల్ లో కూడా వాడ్రా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని ప్రధానంగా డిమాండ్ వినిపించింది. ఇక ఇటీవల వరదల నేపధ్యంలో రేవంత్ రెడ్డి కూడా జిల్లాలలో ఆక్రమణలపై దృష్టి సారిస్తామని చెప్పారు.
గ్రేటర్ వరంగల్ వాసులకు భయం
ఇదిలా ఉంటే తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం వరంగల్ నగరవాసుల భయానికి కారణంగా మారింది. అసలు ఇంతకీ గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్ లో ఏం జరిగిందంటే.. వరంగల్ నగరంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం చేశారు.

జీదబ్ల్యూఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో కీలక నిర్ణయం
జిడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్ లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అటవీ, దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వ సభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆక్రమణలపై ఉక్కుపాదం
వరంగల్ నగరంలో అన్ని చెరువులపై అభివృద్ధి దిశగా తీర్మానం చేసిన క్రమంలో ఆక్రమణల పైన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆక్రమణలకు గురైన ప్రాంతాలను గుర్తించి, వారికి నోటీసులు ఇచ్చి, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించిన క్రమంలో నగరంలోని భద్రకాళీ చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువు, బంధం చెరువు తదితర ప్రాంతాలలో ఎఫ్డీఎల్ పరిధిలో ఇల్లు నిర్మించుకున్న నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ప్రజలు
ఎప్పుడు ఎవరికి నోటీసులు ఇస్తారో.. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని తెగ భయపడుతున్నారు. హైదరాబాద్ తరహాలో వరంగల్లో కూడా ఆక్రమణలు అంటూ అధికారులు కూల్చివేతలకు రంగంలోకి దిగుతారేమో అని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే సమయంలో వరంగల్ నగరంలో చెరువుల పరివాహక ప్రాంతాలలో స్థలాలు కొనుగోలు చేయాలన్నా కూడా ప్రజలు భయపడుతున్నారు.
అక్కడ స్థలాలు కొనాలన్నా భయం
ఆ ప్రాంతాలలో స్థలాలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, హైడ్రా దూకుడు ఇప్పుడు వరంగల్ వాసుల వెన్నులోనూ వణుకు పుట్టిస్తున్నాయి.












Click it and Unblock the Notifications