సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో టెన్షన్ ; నేడు గజ్వేల్ బంద్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. గజ్వేల్ పట్టణంలో తాజాగా జరిగిన ఒక సంఘటన నేడు పట్టణ బంద్ కు పిలుపునిచ్చే వరకు వెళ్ళింది. విగ్రహం ఎదుట ఓ వ్యక్తి మద్యం మత్తులో మూత్రవిసర్జన చేయడంతో గజ్వేల్ పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది.
అయితే మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ముస్లిం కావడంతో అక్కడ ఉన్న హిందువులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. శివాజీ విగ్రహం ఎదుట మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పట్టుకున్న శివాజీ విగ్రహ కమిటీ ఆయన భగత్ యూత్ అతన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో గజ్వేల్ పట్టణంలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలోనూ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న ఇద్దరిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. బాదం మిల్క్ సీసాతో దాడి చేయగా మధు అనే వ్యక్తి తప్పించుకోగా, సందీప్ అనే వ్యక్తికి గాయమైంది. ఇక ఈ ఘటన నేపథ్యంలో హిందువులంతా కలిసి మళ్లీ అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని ధర్నా తో పాటు రాస్తారోకో నిర్వహించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఆందోళన నిర్వహిస్తున్న హైందవులు ఆందోళన విరమించకపోవటంతో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జిల్లా ఎస్పీ అక్కడకు వచ్చి వారికి నిందితులను 24 గంటల్లో పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక తీవ్ర ఆగ్రహంతో ఉన్న హిందువులు నేడు గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చారు. హిందూ ముస్లింల మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్న పోలీసులు చర్యలకు రంగంలోకి దిగారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications