పొలిటికల్ ఎటాక్: హనుమకొండలో హై టెన్షన్.. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భద్రత పెంపు!!
రేవంత్ రెడ్డి పాదయాత్ర తరువాత కాంగ్రెస్ యూత్ నాయకుడి పైన దాడి చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు కారణంగా మారింది. దీంతో పోలీసులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భద్రత పెంచారు.
రేవంత్ రెడ్డి పాదయాత్ర హనుమకొండ రాజకీయాలలో కాక రేపుతోంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర తరువాత కాంగ్రెస్ యూత్ నాయకుడి పైన దాడి చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు కారణంగా మారింది. నిన్న రాత్రి తీపి చూసి రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ ముగిసిన వెంటనే యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ పై హత్యాయత్నం జరిగింది.

యూత్ కాంగ్రెస్ నాయకుడిపై దాడి.. కాంగ్రెస్ ఆగ్రహం
యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా దద్దమ్మ దాస్యం వినయ్ భాస్కర్ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించడంతో, బీఆర్ఎస్ కార్యకర్తలు పవన్ ను ఒక గల్లీలోకి తీసుకువెళ్లి విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో పడి ఉన్న తోట పవన్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తోట పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు
ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసే సీసీ కెమెరాలలో రికార్డు అయిన దాడి దృశ్యాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, నిందితులు పరారీలో ఉన్నట్టు, వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పవన్ పై మూకుమ్మడిగా బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇక తాజా పరిణామాలతో కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు, ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం వద్ద భారీ భద్రత
తోట పవన్ పై బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటనకు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఇక ఈ క్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొనసాగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో కొండ సురేఖ మురళి దంపతులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక నిన్నటికి నిన్న వరంగల్ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు బిల్లా - రంగా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉత్కంఠను రేపుతోంది.












Click it and Unblock the Notifications