బిడ్డా- నేను తలుచుకుంటే..: రేవంత్ రెడ్డి పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఉద్రిక్తత తలెత్తింది. భూపాలపల్లిలో ఆయన ప్రసంగిస్తోన్న సమయంలో గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనపై కోడిగుడ్లు, టమోటాలను విసిరారు.
భూపాలపల్లి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాదయాత్రలో భాగంగా భూపాలపల్లిలో కొద్దిసేపటి కిందటే బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు, టొమాటోలను విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినదించారు.
భారత్ రాష్ట్ర సమితి కార్యకర్తలు, భూపాలపల్లి శాసన సభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తోన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ- ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించిన రేవంత్ రెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ను సైతం ఉద్దేశించి విమర్శలు చేసినట్లు చెబుతున్నారు.

పాదయాత్రలో భాగంగా ఈ రాత్రి ఆయన భూపాలపల్లికి చేరుకున్నారు. స్థానిక ఊర్వశి థియేటర్ సెంటర్ లో వాహనంపై నిల్చుని ప్రసంగించారు. గండ్ర వెంకటరమణారెడ్డిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం పార్టీ ఫిరాయించారు. అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
ఆయనను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఘాటు ఆరోపణలు సంధించారు. తాను తలుచుకుంటే.. నీ ఇల్లు కూడా ఉండదంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని హెచ్చరించారు. ఏదో 100 మంది తాగుబోతు కార్యకర్తలను పంపించి తనపై కోడిగుడ్ల, టొమాటోలను విసిరేయడం రాజకీయం అనిపించుకోదని అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తన ఎదురుగా వచ్చి నిల్చోవాలని, తాడో పేడో తేల్చుకుందామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు, గండ్ర వెంకటరమణా రెడ్డి అనుచరులు టొమాటోలను విసరడం పట్ల కాంగ్రెస్ నాయకులు కూడా అదే రేంజ్ లో స్పందించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపైకి కాంగ్రెస్ నాయకులు కూడా రాళ్లు రువ్వారు. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తత మధ్యే రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు. గండ్ర వెంకటరమణారెడ్డిపై విమర్శలు చేశారు. తన సభలో గందరగోళం సృష్టించాలనుకోవడం అవివేకమని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications