ఉద్యోగులకు పండుగ కానుక - పెండింగ్ డీఏల విడుదల..!!
ఉద్యోగులకు పండుగ కానుక ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పండుగల వేళ తమకు రావాల్సిన పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఏడాది జూలైతో కలిసి అయిదుకు చేరాయి. దీంతో, పండుగ వేళ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించే యోచనలో ఉన్న ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
ఉద్యోగుల వినతులతో
దసరా, దీపావళి వేళ తమకు రావాల్సిన డీఏల పైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయిదు డీఏలు బకాయి ఉండగా.. కనీసం మూడు చెల్లించాలని అభ్యర్ధిస్తున్నారు. ఒక్కో డీఏ చెల్లింపుకు ఏటా రూ 1200 కోట్లు వరకు ఖర్చు అవుతుంది. అదే విధంగా ఎరియర్స్ తో కలిపి నాలుగు డీఏలు చెల్లిస్తే ప్రభుత్వం పై ఏటా రూ 7,900 కోట్ల మేర భారం పడనుంది. దీంతో, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల్లో రెండింటిని దీపావళి నాటికి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

అయిదు డీఏలు బకాయి
ఈ ఏడాది జూలై డీఏతో కలిపితే మొత్తం అయిదు డీఏలను ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఇందులో మూడు వరకు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నారు. కానీ, ప్రభుత్వం నుంచి మాత్రం వారికి స్పష్టమైన హామీ దక్కలేదు. దీంతో, ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల సమస్యల పైన స్పందించాలని ప్రభుత్వం భావిస్తోంది .దీంతో, అధికారికంగా వారికి చెల్లించాల్సిన బకాయిల పైన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని, ఆర్థికపరమైన వాటిని అంశాల వారీగా పరిష్కరిస్తామని చెబుతున్నారు.
దీపావళికి రెండు డీఏలు
తాజాగా ఉద్యోగ సంఘాల నేతలు సీఎం ముఖ్యకార్యదర్శిని కలిసి తమ డిమాండ్లపై చర్చించారు. కాగా, ఉద్యోగులకు ఒక డీఏ చెల్లింపునకు నెలకు రూ.100 కోట్లకు పైగా అవుతుందని, ఈ లెక్కన ఏడాదికి రూ.1200 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అదే నాలుగు డీఏలు అమలు చేస్తే.. ఏరియర్స్‌తో కలిపి రూ.7900 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని అధికారులు లెక్కలు కడుతున్నారు. దీంతో, ప్రభుత్వం ప్రస్తుతం నాలుగు డీఏలు చెల్లించే అవకాశం ఉండదని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. దీపావళి నాటికి రెండు డీఏలు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పటికే పీఆర్సీ ఆలస్యం కారణంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. దీంతో, ప్రభుత్వ అధికారిక నిర్ణయం కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications