వాహనదారులపై పన్ను మోత - ప్రభుత్వం తాజా ఉత్తర్వులు..!!
రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు చెల్లించే లైఫ్ ట్యాక్స్‌ను రవాణా శాఖ పెంచింది. ఖరీదైన వాహనాలపై ఒకటి నుంచి ఆరు శాతం వరకు పెంచింది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై తర్వాత తెలంగాణకు బదిలీ చేసిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా వాటి విలువను బట్టి 1 నుంచి 6 శాతం వరకు పెంచారు. ఈ మేరకు రవాణా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం వాహనాల శ్లాబులను వెల్లడించింది.
కొత్తగా వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు, కార్లను కొనుగోలు చేసేటప్పుడు వాహనదారులు చెల్లించే లైఫ్ ట్యాక్స్‌ను రవాణా శాఖ పెంచింది. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ద్విచక్ర వాహనాల శ్లాబులు రెండు నుంచి నాలుగుకు, కార్లు, జీపుల శ్లాబులు నాలుగు నుంచి ఐదుకు పెరిగాయి. ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు సైతం భారీగా పెరిగాయి. కార్ల ఎక్స్ షోరూం ధర రూ.10 లక్షల కంటే తక్కువగా ఉంటే దానిపై అదనంగా ఎలాంటి భారం పడదు. రూ.10 - 20 లక్షలు దాటితే ఒక శాతం, రూ.50 లక్షలు దాటితే 2 శాతం అదనంగా చెల్లించాలి. కంపెనీలు, సంస్థలకు సంబంధించి 10 సీట్లలోపు వాహనాల ధర గతంలో రూ.20 లక్షలకు పైగా ఉంటే లైఫ్ ట్యాక్స్ 20 శాతం ఉండేది. ఇప్పుడు ఆ శ్లాబును రెండుగా మార్పు చేస్తూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు.

అదే విధంగా రూ.20-50 లక్షల వాహనాలకు 22 శాతం, రూ.50 లక్షలకు దాటితే 25 శాతం కట్టాలి. దీంతో పాటుగా ఫ్యాన్సీ (స్పెషల్ రిజర్వు) నంబర్ల ధరల్ని పెంచుతూ రవాణా శాఖ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఐదు శ్లాబులు ఉండగా, ఇప్పుడు ఏడుకు పెంచింది. గతంలో 9999 నంబర్ కావాలంటే కనీసం రూ.50 వేల కంటే ఎక్కువ ధరను కోట్స్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యాన్సీ నంబర్లకు గతంలో 5 శ్లాబులు ఉండేవి. అవి రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు. వాటిని ఏడుకు పెంచారు. ఇక, కొనుగోలు చేసే ద్విచక్ర వాహనం ఎక్స్ షోరూం ధర రూ.లక్షలోపు ఉంటే అదనంగా ఎలాంటి భారం ఉండదు. ధర రూ.లక్ష దాటితే 3 శాతం, రూ.రెండు లక్షలు దాటితే 6 శాతం లైఫ్ ట్యాక్స్ పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పెరిగిన పన్నుల వివరాలను వెల్లడించింది.












Click it and Unblock the Notifications