ఈ రూట్ లల్లో రూ. 50 నుంచి రూ. 100 వరకు బస్ ఛార్జీలు తగ్గించిన TGSRTC
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు శుభవార్త అందించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పుష్పక్ బస్సుల ఛార్జీలను తగ్గించింది. రాత్రి పూట మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. పగటిపూట రాకపోకలు సాగించే బస్ ఛార్జీల్లో ఎటువంటి తగ్గింపు లేదు.
రాత్రివేళ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించడంలో భాగంగా టీజీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఛార్జీలను తగ్గించడం ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు ప్రజా రవాణాను వినియోగించుకుంటారని, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని భావిస్తోంది.

రాత్రి 10 గంటల నుండి తెల్లవారు జాము 6 గంటల వరకు మాత్రమే ఈ ఛార్జీల తగ్గింపు అమలులో ఉంటుంది. అర్ధరాత్రి వేళల్లో విమానాశ్రయానికి చేరుకునే వారికి, ముఖ్యంగా ఆలస్యమైన విమానాలలో వచ్చే వారికి, ఇతర ఖరీదైన రవాణా మార్గాలపై ఆధారపడకుండా ఇది గణనీయమైన ఉపశమనం కల్పిస్తుందని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది.
సవరించిన ఛార్జీల ప్రకారం.. ప్రయాణ దూరాన్ని బట్టి 50 నుండి 100 రూపాయల వరకు తగ్గింపు ప్రయాణికులకు లభించనుంది. ఉదాహరణకు- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి జూబ్లీ బస్ స్టేషన్ కు ప్రస్తుతం వసూలు చేస్తోన్న ఛార్జీ 450 రూపాయలు. ఇప్పుడది 400 రూపాయలకు తగ్గింది.
ఎయిర్‌పోర్ట్- శంషాబాద్ 200 నుంచి 100, ఎయిర్‌పోర్ట్- ఆరాంఘర్ 250 నుంచి 200, ఎయిర్‌పోర్ట్- మెహిదీపట్నం 350 నుంచి 300, ఎయిర్‌పోర్ట్- పహాడీషరీఫ్ 200 నుంచి 100, ఎయిర్‌పోర్ట్- బాలాపూర్ 250 నుంచి 200, ఎయిర్‌పోర్ట్- ఎల్బీనగర్ 350 నుంచి 300, ఎయిర్‌పోర్ట్-జేబీఎస్ 450 నుంచి 400, ఎయిర్‌పోర్ట్- జేఎన్‌టీయూ 450 నుంచి 400, ఎయిర్ పోర్ట్- మియాపూర్ 450 నుంచి 400, ఎయిర్‌పోర్ట్- లింగంపల్లి 450 నుంచి 400 రూపాయలకు తగ్గింది.












Click it and Unblock the Notifications