ఆ ఉద్యోగినుల బాద్యత మీదే..! ఐటీ సంస్థలకు మార్గదర్శకాలు విడుదుల చేసిన పోలీసులు..!!
హైదరాబాద్ : నగరంలో పెరిగిపోతున్న క్రైమ్ రేట్ ను నియంత్రించేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది. అందులో భాగంగా రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగిణుల భద్రత ఆయా సంస్థల యాజమాన్యాలే తీసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసారు. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత సంస్థలో పని చేయించుకునే మహిళా ఉద్యోగినుల బాధ్యత ఇకపై ఆయా ఐటీ సంస్థలదేనని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.
రాత్రిపూట ఉద్యోగం చేసే వారికి రవాణా సదుపాయం కల్పించడంతోపాటు, వారు సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు సంస్థల యాజమాన్యాలే బాధ్యత వహించాలని తెలిపారు. కార్మిక చట్టం 3వీ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. నగర శివారు ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఒక వేళ ఉద్యోగిని సంస్థ ఏర్పాటు చేసిన రవాణా వాహనంలో వెళ్లడానికి ఇష్టపడక పోయినా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నా ఆ మేరకు లిఖిత పూర్వకంగా ఆమె నుంచి అంగీకారాన్ని తీసుకుని భద్రపరచాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో దాదాపు వెయ్యి వరకు ఐటీ సంస్థలు ఉండగా వీటిలో దాదాపు ఐదు లక్షల మంది పని చేస్తున్నారు. వీరిలో 40 శాతం మంది మహిళలని ఓ అంచనా.
ఇటీవల సైబరాబాద్ పరిధిలోని చేవెళ్ల, నార్సింగి, శంషాబాద్ ప్రాంతాల్లో వెలుగు చూసిన హత్యలు, యాదాద్రి జిల్లా హాజీపూర్ ఘటన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉద్యోగులు క్షేమంగా ఇళ్లకు చేరే అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అత్యవసర సమయాల్లో అవసరమైతే డయల్ 100, వాట్సాప్ నంబర్ 9490617444కు సమాచారం అందించి సాయం పొందాలని సూచించారు.












Click it and Unblock the Notifications