సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుందని.. రోకలి బండతో మోది చెల్లిని చంపిన అన్న!!
ఇటీవల కాలంలో మహిళలు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ అనేక వీడియోలు చేసి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చాలామంది మగవారికి నచ్చని అంశంగా మారింది.
తాజాగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ రీల్స్ చేసి ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్న సోదరిపై ఆగ్రహంతో అన్న రోకలి బండతో మోది హతమార్చిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాజీవ్ నగర్ లో ఓ అన్న చెల్లెల్ని దారుణంగా హత్య చేశాడు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అజ్మీర సింధు అలియాస్ సంఘవి అనే యువతి మహబూబాబాద్ లో ఏఎన్ఎం గా ప్రాక్టీస్ చేస్తుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తను చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇలా సోదరి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం అన్న హరిలాల్ కు అస్సలు నచ్చలేదు. ఈ విషయంలో ఇద్దరికీ తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి.
ఇదే క్రమంలో తాజాగా ఇద్దరి మధ్య జరిగిన గొడవ తారా స్థాయికి చేరుకొని ఆగ్రహంతో ఊగిపోయిన అన్న ఇంట్లో ఉన్న రోకలి బండ తీసుకుని సోదరి తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగిన యువతి అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ కు తీసుకు వెళ్లాల్సిందిగా సూచించారు.
వరంగల్ కు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో యువతి మరణించింది. అయితే రాయి తగిలి మరణించిందని హడావిడిగా అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేయగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అన్న హరిలాల్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హరిలాల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరిలాల్ కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications