తెలంగాణలో ఫైనల్ డే: ఉత్కంఠత
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. పోలింగ్‌కు ఇంకో రెండు రోజులే మిగిలివున్నాయి. ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ సాయంత్రానికి ప్రచారానికి తెర పడుతుంది. 30వ తేదీన పోలింగ్. చివరి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం హోరెత్తనుంది.
30వ తేదీన పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు.. వరంగల్, గజ్వేల్‌లల్లో పర్యటించనున్నారు. ఈ రెండు చోట్లా ప్రజా ఆశీర్వాద సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చివరిరోజున కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ.. హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు.
మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలను నిర్వహిస్తారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రోడ్ షోలను నిర్వహించనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలో రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలోని ఆనంద్ బాగ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీని తరువాత ప్రియాంక గాంధీ.. జహీరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.
బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారమే హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి సర్వశక్తులను ఒడ్డింది బీజేపీ.












Click it and Unblock the Notifications