పులులకు విషమిచ్చి చంపిన పశువుల కాపరులు.. నిందితుల్లో ఒకరు మైనర్...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్ట్‌లో రెండు పులులు మృతి సంచలనంగా మారింది. పులులను చంపిన వారిని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ ముగ్గురిలో ఒకరు మైనర్ కూడా ఉన్నట్లు సమాచారం. పులులను చంపాలనే ఉద్దేశ్యంతోనే పశు కళేబరంపై విషం చల్లినట్లు విచారణలో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు అటవీ శాఖ అధికారులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
నిందితుల్లో అసిఫాబాద్ డివిజన్ వాంకిడి చెందిన కోవా గంగు, ఆత్రం జల్‌పతితో పాటు పదకొండేళ్ల మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ ముగ్గురు కలిసే పులులపై విషప్రయోగం జరిపారని తేలింది. మృతిచెందిన పశువుల కళేబరాలపై విషం చల్లడంతో వాటిని తిన్న రెండు పులులు చనిపోయాయని, ఈ విషయాన్ని స్వయంగా నిందితులే విచారణలో ఒప్పుకున్నట్ల అసీఫాబాద్ డీఎఫ్‌వో నీరజ్ కుమార్ టేబ్రీవాల్ తెలిపాడు.

70మంది సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు..
పులులు పశువులపై దాడి చేసి చంపేయడం వల్ల వాటికి విషం పెట్టి చంపామని నిందితులు విచారణలో వెల్లడించారు. ఈ మేరకు నిందితులను శుక్రవారం నాడు కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు వివరించారు. నిందితుల్లో గంగు, జలపతికి న్యాయస్థానం పన్నెండు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. పదకొండేళ్ల మైనర్ బాలుడిని పేరెంటల్ బాండ్‌పై విడుదల చేశారు. పులుల మృతి ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతుందని త్వరలోనే పూర్తిసమాచారాన్ని వెల్లడిస్తామని డీఎఫ్‌వో తెలిపారు.
అయితే, కాగజ్‌నగర్ ఫారెస్టులో ఈనెల 6న పులిపిల్ల కళేబరం దొరికింది. అనంతరం జనవరి 8వ తేది ఓ మగ పులి కళేబరం దొరికింది. వీటితో పాటు మరో నాలుగు పులులు కూడా కనిపించకపోవడంతో దీంతో ఈ కేసు కాస్త చర్చనీయాంశంగా మారింది. మొదటి పులి మృతి చెందిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 70 మంది సిబ్బందితో పాటు అటవీశాఖాధికారులు కాగజ్ నగర్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్‌లో పులుల కోసం వెతకడం మొదలెట్టారు. చివరకు నిందితులను కనిపెట్టారు.












Click it and Unblock the Notifications