BJP: బీజేపీ అధిష్ఠానం తీరుతో ఇరకాటంలో రాష్ట్ర నేతలు..
తెలంగాణలో బీజేపీ క్రమంగా పుంజుకుంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన ఆ పార్టీ.. ఇప్పుడు మూడు స్థానాలతో ఊపు మీద ఉంది. మొన్న మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో కూడా గట్టి పోటీ ఇచ్చింది. దీంతో రాష్ట్ర కమలదళంలో ఉత్సాహం పెరుగుతోంది. ముఖ్యంగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆ పార్టీ బలపడుతూ వస్తుంది.

ప్రజా సంగ్రామ యాత్ర
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి రాష్ట్ర నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. ఇలా కాషాయ పార్టీకి బలం పెరుగుతున్న దశలో బీజేపీ కేంద్ర పెద్దల మాటలు రాష్ట్ర నాయకులను ఇరకాటంలో పడేస్తున్నాయి. అధిష్ఠాన నేత మాటలతో రాష్ట్రస్థాయి నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ఇబ్బంది పడుతున్నారు.

నరేంద్ర మోడీ
రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు బీజేపీ రాష్ట్ర నేతలను కాస్త ఇబ్బంది పెట్టాయి. రాష్ట్ర విభజన తల్లిని చంపి బిడ్డను బతికించ్చినట్లుగా ఉందని అన్నారు. ఈ మాటలు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆయుధాలుగా మారాయి. దీంతో రాష్ట్ర కమలం నేతలు డిఫెన్స్ చేయాల్సి వచ్చింది.

రేవంత్ రెడ్డి
తాజాగా రేవంత్ రెడ్డిని అవహేళన చేస్తూ లోక్ సభలో నిర్మలా సీతారామన్ మాట్లాడడం రాష్ట్ర నేతలకు మింగుడు పడడం లేదు. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో పీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి రూపాయి విలువ పడిపోవడంపై ప్రశ్న అడిగారు. రూపాయిని ఐసీయూ నుంచి స్మశానానికి పంపిస్తారా లేక బాగు చేసి ఇంటికి తీసుకొస్తారా అని ప్రశ్న అడిగారు.

నిర్మలా సీతారామన్
దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. గౌరవ సభ్యుడు వచ్చి రాని హిందీలో ప్రశ్న అడిగారు. నేను కూడా వచ్చి రాని హిందీలో సమాధానం ఇస్తానని అన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి బదులిస్తు మేం శుద్రులం మాకు ఇంతే వచ్చు.. మీరు బ్రహ్మణులు కాదా అని అన్నారు. ఇంతలో స్పీకర్ కలుగజేసుకుని కులాలను తీసుకురావొద్దని కోరారు.

ఎమ్మెల్సీ కవిత
నిర్మలా సీతారామన్ అలా మాట్లాడడంపై అభ్యంతరాలు వ్యక్త అయ్యాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా సీతారామన్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. తెలంగాణలోని మేధావులు కూడా నిర్మలమ్మ మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీతారామన్ వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీ నేతలు మరోసారి ఇరకాటంలో పడ్డారు.
ఇదే కాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి పార్టీ అధ్యక్షుడు బండి యాదగిరిగుట్టలో ప్రమాణం చేయాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications