కవిత జీవితాన్ని మార్చేసిన ఉద్యమం..! చిన్ననాటి ఆశ, కాలేజీ కల నెరవేరలేదు..! అసలేంటవి..?
నిజామాబాద్ / హైదరాబాద్ : జాతీయ స్థాయిలో అన్ని పార్టీల్లో కుటుంబ పార్టీలు ఉన్నాయని, తెలంగాణ కోసం తమ కుటుంబం సుదీర్ఘంగా ఉద్యమం చేసిందని, తద్వారానే తమ కుటుంబం మొత్తం రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు ఎంపీ కవిత. బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్లో నాయకుల సంతతే రాజకీయాల్లో ఉన్నారన్నారు. పనిచేసే వారికే ఎప్పుడూ ప్రజల మద్దతు ఉంటుందన్నారు. మందిర్, మసీద్ అంటూ రాజకీయం నడపడం బీజేపీకి పరిపాటేనని విమర్శించారు. ట్విటర్ వేదికగా నిజామాబాద్‌లోని తిలక్ గార్డెన్‌లో 'ఆస్క్ కవిత రచ్చబండ కార్యక్రమం' నిర్వహించారు. ట్విటర్ ద్వారా ప్రజలు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలిచ్చారు.

వ్యాపారమంటే ఇష్టం..! తెలంగాణ ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చానన్న కవిత..!!
నర్సు అవ్వాలన్నది నా చిన్నప్పటి కల. ఆస్పత్రులకు వెళ్లినప్పుడు నర్సులు తెల్ల గౌను వేసుకొని రోగులకు వైద్యసేవలు అందించడాన్ని చూసి పెద్దయ్యాక నర్సు వృత్తిలోనే చేరాలని అనుకున్నాను అని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మారిన పరిస్థితుల కారణంగా తాను ఇంజనీరింగ్ చదివి, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించానని చెప్పారు. వ్యాపారవేత్తగా రాణించాలనుకున్నా అదీ సాధ్యపడలేదని, విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం తన భవిష్యత్తునే మార్చేసిందన్నారు. కుటుంబంతో పాటు తానూ ఉద్యమంలో పాలుపంచుకుని రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

కేటీఆర్ వి బాద్యతాయుత రాజకీయాలు..! కేంద్ర నిధుల కోసమే ఎక్కువ ఎంపీలు గెలవాలంటున్న కవిత..!!
సోదరుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఏం చెబుతారు? అంటూ ఒకరు ప్రశ్నించగా.. ‘‘రాజకీయవేత్తగా, తండ్రిగా, అన్నగా, భర్తగా ఆయన సంపూర్ణ బాధ్యతలు నెరవేరుస్తున్నారని మాత్రం చెప్పగలను'' అని ఎంపీ కవిత అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలనే మరోసారి గెలిపించాలని అంటున్నారు.. ఎందుకు? అంటూ ఓ యువకుడు ట్విటర్ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్రం యొక్క సమస్యలు కేంద్రానికి వివరించి అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావడం కోసమే టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపించాలని అంటున్నామన్నారు. ఇతర పార్టీలకు అవకాశమిస్తే జాతీయ సమస్యలను ప్రస్తావిస్తూ కాలయాపన చేస్తారని తెలిపారు. 77 ఏళ్ల పాటు కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇచ్చిన ప్రజలకు టీఆర్‌ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చూస్తున్నారని తెలిపారు.

గాంధీ, అంబేద్కర్ ఇద్దరూ గొప్పవారే..! కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టు గా కేంద్రం అంగీకరిస్తే హాపీ..!
గాంధీ, అంబేడ్కర్‌లలో ఎవరు గొప్పవారని అడిగిన ప్రశ్నకు.. ‘‘అంబేడ్కర్ అన్ని వర్గాల ప్రజల సమానత్వాన్ని కోరుకోగా.. గాంధీజీ సత్యాగ్రహం చేపట్టి దేశప్రజలకు స్వాతంత్య్రం తెచ్చి పెట్టారని.. ఇద్దరూ గొప్ప వారని, మార్గాలు మాత్రం వేరు'' అని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ కోసం ఏమి కోరుతారు? అన్న ప్రశ్నకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలని కోరుతానన్నారు. నీతి ఆయోగ్ సూచించిన 24 వేలకోట్ల ప్రతిపాదన అమలైతే సంతోషిస్తామన్నారు.

మంచి కార్యక్రమం..! ట్విట్టర్ ప్రతినిధులకు కవిత క్రుతజ్ఞతలు..!!
పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ 2500 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామన్నారు. ఎంపీగా తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చానని కవిత అన్నారు. పసుపు బోర్డు సాధించడంలో కొంత వెనుకబడ్డానన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ యూనివర్సిటీ ప్రాంతంలో మంచి ప్లే గ్రౌండ్‌ను నిర్మిస్తామన్నారు. వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య అనుసంధానం చేసిన ట్విటర్ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.