వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారు వీరననేలా, అందరిపై రెచ్చిపోతున్న కోమటిరెడ్డి: ఎందుకు?

By Pratap
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: గత కొద్ది రోజులుగా నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పార్టీ నాయకులపై రెచ్చిపోతున్నారు. ఒకరిద్దరిపై కాదు, అందరిపైనా ఆయన విరుచుకుపడుతున్నారు. సీనియర్లపైనా జూనియర్లపైనా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరబోతున్నట్లు ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి.

దాదాపు 20 రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల మొదటివారంలో టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే ఈ నెల రెండవ తేదీన హైదరాబాద్‌ చేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు రోజుల పాటు మౌనంగా ఉండిపోయారు. ఇదే సమయంలో నల్లగొండ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రచారం సాగింది.

ఆ ప్రచారాన్ని బలపరుస్తున్నట్లుగా ఈ నెల రెండో తేదీన గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు. ఈ పరిణామాలను కోమటిరెడ్డి ఊహించలేదని, ఆ పరిణామం ఆయనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అంటున్నారు తాను టీఆర్‌ఎస్‌లో చేరబోతున్న తరుణంలో గుత్తా ట్విస్ట్ ఆయనకు నచ్చలేదని అంటున్నారు .తనకు చెక్‌ పెట్టాలనే జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు గుత్తాను తెరమీదకు తెచ్చారని ఆయన భావించినట్లు చెబుతున్నారు.

ఈ స్థితిలోనే 4వ తేదీన కోమటిరెడ్డి ఉన్నట్టుండి మంత్రి హరీశ్‌రావు ఇంటికి వెళ్లి మళ్లీ ఊహాగానాలకు తెర లేపారు. జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికే హరీష్ రావును కలిశానని చెప్పినా ఎవరూ విశ్వసించడం లేదు. హరీష్ రావు ఇంటి నుంచి నేరుగా కాంగ్రెసు లెజిస్లేటర్ పార్టీ (సీఎల్పీ) కార్యాలయానికి వెళ్లారు. అక్కడ్నుంచే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీని నడపటం చేతకావడం లేదని, ఆయన చేతకానితనం వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిందని కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. తానే పిసిసి అధ్యక్షుడిగా ఉంటే పార్టీ గెలిపించి ఉండేవాడినని, ఒకవేల ఓడిపోతే తాను రాజీనామా చేసి ఉండేవాడినని కూడా అన్నారు.

komatireddy venkat reddy

భువనగిరిలో తన తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి ఓటమికి కూడా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డినే కారణమంటూ నిప్పులు చెరిగారు. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెసు సీనియర్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తేరుకున్న తర్వాత ఆయనపై ఎదురుదాడికి దిగారు. పీసీసీ అయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేసింది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరును అమెరికాలో ఉన్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధిష్టానం కూడా ఆయనను హెచ్చరించినట్లు సమాచారం. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. పార్టీ వైపు నుంచి షోకాజ్‌ నోటీసు జారీ అయిన తర్వాత మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ప్రశ్నించే అధికారం పీసీసీకి లేదన్నారు. అన్ని విషయాలు సోనియాగాంధీకి చెబుతానని అన్నారు.

ఉత్తమ్‌ కుమార్ రెడ్డిని తాను పీసీసీ అధ్యక్షునిగా గుర్తించడం లేదని అన్నారు. జానారెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి వంటివారి కంటే పార్టీలో తానే సీనియర్‌నని, తనను ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిని తొలగించే వరకు తాను పోరాటం సాగిస్తానని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జానారెడ్డి, సీనియర్ కాంగ్రెసు నాయకులు చాలా మంది తన నల్లగొండ జిల్లాకు చెందినవారే కావడం వల్ల కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ఆధిపత్యం కోసం దూకుడు ప్రదర్సిస్తున్నారని అంటున్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ దూకుడును ఎంత వరకు కొనసాగిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోనియాగాంధీని ఎప్పుడు కలుస్తారనే విషయాన్ని ఇప్పటి వరకు వెంకటరెడ్డి చెప్పలేదు. సోనియాను కలవడం ఆయనకు అంత సులబం కాకపోవచ్చు. అయితే, ఈ లోగానే ఆయనను సస్పెండ్ చేయాలని పిసిసి వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి కోమటిరెడ్డికి కావలసింది కూడా అదేనని అంటున్నారు.

పార్టీ తనపై సస్పెన్షన్‌ వేటు వేయగానే మరింతగా దుమ్మెత్తిపోస్తూ టిఆర్ఎస్‌లోకి వెళ్లవచ్చునని అంటున్నారు. బలమైన కారణంగానే కోమటిరెడ్డి రెచ్చిపోతున్నారనే ప్రచారం సాగుతోంది. 2014 ఎన్నికల్లో విద్యార్హతపై నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న అంశంపై కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు. ఈ స్థితిలో శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి విజయం సాధించాలనే వ్యూహంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
It is said that Nalgonda Congress MLA Komatireddy Venkat Reddy is in strategy to conter Congress senior leaders for his political future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X