మునుగోడులో 92 శాతం పోలింగ్ - గెలుపు ఎవరిదో తేలిపోయింది..!!
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ పెంచిన మునుగోడులో రికార్డు పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక శాతం పోలింగ్ జరిగింది. భారీ పోలింగ్ అంచనాల నడుమ మునుగోడులో 92 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,24,878 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం గా నిలిచింది. 2018 ఎన్నికల్లో మునుగోడులో 91.07 శాతం ఓటింగ్ జరగ్గా, ఇప్పుడు ఆ రికార్డును అధిగమించింది. రాజగోపాల్ రాజీనామా మొదలు..మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం అయ్యే ముందు వరకు రాజకీయంగా ఉత్కంఠ కొనసాగింది.
భారీ పోలింగ్ దేనికి సంకేతం
ఉదయం మందకోడిగా పోలింగ్ ప్రారంభమైంది. ఆ తరువాత క్రమేణా ఊపందుకుంది. సాయంత్రం పోలింగ్ సమయం ముగిసినా..పోలింగ్ కేంద్రాల వద్ద అనేక మంది బారులు తీరి ఉన్నారు. రాత్రి 8 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో ఓట్లు వేసారు. మొత్తంగా కొన్ని చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. బయట వ్యక్తులు వచ్చి ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ - బీజేపీ నేతలు ఒకరి పై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇక, పోలింగ్ పెద్ద ఎత్తున జరగటంతో ముందుగానే సర్వే చేసిన సంస్థలు..ఈ భారీ పోలింగ్ తో తమ లెక్కలు సరి చేసుకొనే పనిలో పడ్డాయి. సాధారణంగా ఉప ఎన్నిక..అందునా మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఇంత భారీగా పోలింగ్ జరగటం పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఎనిమిదేళ్ల అధికార పార్టీ పైన వ్యతిరేకతకు ఈ పోలింగ్ నిదర్శనమని..తమ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్ కు అనుకూలంగా మెజార్టీ సర్వేలు
అంతకుముందు హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో 84.75 శాతం, దుబ్బాకలో 82.61 శాతం, నాగార్జునసాగర్ 88 శాతం, హుజూరాబాద్‌లో 87 శాతం ఓటింగ్ నమోదైంది. వీటిల్లో, రెండు చోట్ల బీజేపీ గెలుపొందగా.. మరో రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్దులు గెలుపొందారు. దీంతో, ఇప్పుడు మునుగొండ పైన ఉత్కంఠ పెరుగుతోంది. తెలంగాణ కేబినెట్..ఎమ్మెల్యేలు మొత్తం నియోజకవర్గంలో మొహరించినా ఓటర్లు బీజేపీ వైపే నిలిచారని, రాజగోపాల్ ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేసారు. అదే సమయంలో టీఆర్ఎస్ కు సర్వే సంస్థల్లో వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అలో అధిక శాతం అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం పైన అనుకూలత - వ్యతిరేకత కంటే, స్థానిక అంశాలు.. రాజగోపాల్ చుట్టూనే ఎన్నిక అంశాలు ప్రభావితం చేసాయని విశ్లేషణలు వస్తున్నాయి. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి.
గెలుపు మాదే అంటున్న కమలం నేతలు
ఇక, కాంగ్రెస్ మాత్రం ఈ ఉప ఎన్నికలో మూడో స్థానం కు పరిమితం కానుందని దాదాపుగా అన్ని సంస్థలు తేల్చాయి. మహిళలు టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నారని, యువత మాత్రం రాజగోపాల్ కు మద్దతుగా ఓటింగ్ లో పాల్గొన్నారంటూ కొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని వ్యాఖ్యానించారు. మునుగోడు ఫలితం గురించి ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. దీంతో, పోలింగ్ కేంద్రాల వారీగా పూర్తి వివరాలు తెప్పించుకుంటున్న టీఆర్ఎస్ - బీజేపీ - కాంగ్రెస్ నేతలు...పోలింగ్ సరళి పైన పూర్తి స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు. మునుగోడు ఫలితం గురించి సర్వే సంస్థల నివేదికలు..భిన్నాభిప్రాయాలతో ఉన్నా..అసలు ఓటరు ఏం తేల్చారనేది 6వ తేదీన వెల్లడి కానుంది.












Click it and Unblock the Notifications