Komuravelli: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..
వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో పాటు ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలోని మహామండపంలో స్వామివారికి కల్యాణం నిర్వహించి ఒడిబియ్యం, పట్నాలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి శ్రీఘ్ర దర్శనానికి 2 గంటలు సమయం, ధర్మదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
సట్టేడు వారాలు కావడంతో భక్తులు కొమురవెల్లి భారీగా వస్తున్నారు. శని, ఆదివారాలు భారీగా భక్తులు వస్తారు. అటు యాదాద్రిలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్ష్మీనర్సింహాస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. రూ.150 సర్వదర్శనానికి రెండు గంటలు.. ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం తెలంగాణ హైకోర్టు జస్టిస్ టి వినోద్ కుమార్ కుటుంబ సమేతంగా లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు.

ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందజేశారు. అటు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొండగట్టు అంజన్న దేవాలయానికి కూడా భారీగా భక్తులు తరలొచ్చారు. ధర్మపురి లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భారీగా భక్తులు రావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అటు తిరుమలలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనాలు కూడా ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం శ్రీవారిని 63,728 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 19,206 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications