తెలంగాణలో మొదలైన ఎమ్మెల్సీ ఆశావహుల హడావిడి.!ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ బిజీ.!
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రహసనం ముగిసిపోవడంతో గులాబీ నేతల దృష్టి ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అవకాశాలవైపు మళ్లినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆశావహులు తమతమ ప్రయత్నాల్లో మునిగిపోయినట్టు తెలుస్తోంది. ఎర్రవెల్లి ఫాం హౌస్ కు కొంత మంది, మంత్రి కేటీఆర్ ఇంటి వైపు కొంతమంది, రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్సీ కవిత ఇంటివైపు కొంత మంది ఆశావహులు చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ సీఎం చంద్రశేఖర్ రావు మాత్రం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మొదలైన ఎమ్మెల్సీ సెగ.. ముమ్మర ప్రయత్నాల్లో ఆశావహులు
తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం కమ్ముకొస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ హుజురాబాద్ ఉప ఎన్నికలో నువ్వా నేనా అన్నట్టు బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల బరిలో పోరాటం చేసాయి. కాగా అధికార గులాబీ పార్టీకి ఊహించని పరాజయం ఎదురవ్వడంతో కాస్త ఖంగుతిన్న పరిస్తితులు తలెత్తాయి. ఓటమి వల్ల అదికార పార్టీకి జరిగే నష్టం ఏమి లేదని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా, ఓటమికి గల కారణాలను నివేదిక రూపంలో ఇవ్వాలని సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇలాంటి సందర్బంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది.

కీలక నేతలతో మంతనలు.. ఫాంస్ వైపు పయనిస్తున్న నేతలు..
అనేక కారణాలతో ఎమ్మెల్సీ ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేస్తూ వస్తోంది. ప్రధానంగా కోవిడ్ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించరాదని భావించిన ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేస్తూ వస్తోంది. మొత్తానిక కోవిడ్ నుండి బయటపడి సాధారణ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సిన ఆరు స్ధానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తెలంగాణలో పార్టీకి సేవ చేసిన చాలా మందితో పాటు, పార్టీ మారిన నేతలు కూడా ఎమ్మెల్సీ పదవికోసం ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం.

ఆరుగురిలో ముగ్గురికి రెన్యువల్.. ముగ్గురు కొత్త వాళ్లకు అవకాశం..
తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీల వదవీకాలం ఈ యేడాది జూన్ 3న ముగిసింది. ఎమ్మెల్యే కోటాలో ఈ ఆరు స్థానాలను భర్తీ చేసేందకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పదవీకాలం ముగిన వారిలో ఆకుల లలిత, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, మహమ్మద్ ఫరీదుద్దీన్, నేతి విద్యాసాగర్ రావు మరియు బోడకుంట్ల వెంకటేశ్వర్ రావు ఉన్నారు. వీరిలో ఇద్దరికి లేదా ముగ్గిరికి ఎమ్మెల్సీలుగా తిరిగి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆరుగురిలో ఇద్దరు-ముగ్గురికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇప్పటికే హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం. మిగిలిన మూడు,నాలుగు స్థానాలకు తీవ్ర పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది.
Recommended Video

యల్ రమణ కు ఛాన్స్.. క్యూ లో ఎర్రోల్ల శ్రీనివాస్..
మండలి ఛైర్మన్ గా పదవి బాద్యతలు చేపట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డికి మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం తప్పక వస్తుందనే చర్చ జరుగుతోంది. ఈయనతో పాటు ఆకుల లలిత, కడియం శ్రీహరి లకు ముఖ్యమంత్రి నుండి సానుకూల సంకేతాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నాలుగో అభ్యర్దాగా గతంలో శాసనసభ స్పీకర్ గా చేసిన మధుసూధనా చారికి అవకాశం ఇవ్వాలని సీఎం యోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇక ఐదో స్ధానానికి ఉద్యమ కారుడు ఎర్రోల్ల శ్రీనివాస్ కు అవకాశం కల్పించాలని సీఎం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. చివరి ఆరో స్ధానాన్ని చేనేత సామాజిక వర్గం నుండి చట్ట సభల్లో ఇంత వరకూ ప్రాతినిధ్య లేకపోడంతో యల్ రమణకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని సీఎం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబందించి కీలక సమాచారం వెలువడనుంది.












Click it and Unblock the Notifications