గుబులు అవసరం లేదు.!శ్రేణులు మొత్తం గులాబీ పార్టీతోనే ఉన్నాయి.!ధీమా వ్యక్తం చేసిన హరీష్ రావు.!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ఠ్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోనే పనిచేస్తామని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కమలాపూర్ మండల ప్రజా ప్రతినిధులు విస్పష్టంగా ప్రకటించారని ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు తెలిపారు. శనివారం హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లతో కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు.
కమలాపూర్ మండల పరిషత్ అధ్యక్షులు తడక రాణీ శ్రీకాంత్, కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ పేరాల సంపత్ రావు, కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ పీ. కృష్ణ ప్రసాద్, మండల రైతు బంధు అధ్యక్షులు శ్రీనివాస్, టీ.ఆర్.ఎస్. సీనియర్ నాయకుడు కుమారస్వామి, తదితరులు మంత్రి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరింగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ అంశంపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఈటల రాజీనామా చేస్తే తలెత్తే పరిణామాలపై లోతుగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. గంగుల కమలాకర్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో రోజూ ఏదోఒక మార్గంలో చర్చలు జరుపుతూనే ఉన్నారు. అనంతరం కమలాపూర్ మండల ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కమలాపూర్ మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెంటే ఉన్నారని, ఉంటామని వారు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి భిన్నభిప్రాయాలకు తావు లేదని, తామంతా గులాబీ పార్టీతోనే ఉన్నామని వారు స్పష్టంచేశారు.
Recommended Video
హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా సాగడానికి, నియోజకవర్గ ప్రజలకు మేలు జరగడానికి టీ.ఆర్.ఎస్. జెండా నీడలోనే సాధ్యమని వారు వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం ( 2001 ఏప్రిల్ 27 ) నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తాము చంద్రశేఖర్ రావు నాయకత్వంలోనే ఎప్పటికీ కొనసాగుతామని కమలాపూర్ మండల ప్రజా ప్రతినిధులు తెలిపారు.












Click it and Unblock the Notifications