తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ లేదు... వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం... : సీఎస్ సోమేశ్ కుమార్
దేశంలో అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM)నిపుణులు దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. థర్డ్ వేవ్ హెచ్చరికలపై తాజాగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ స్పందించారు. తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ వచ్చినా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌లో 100 శాతం వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. దేశంలో హైదరాబాద్‌లో తప్ప మరే నగరంలో 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టలేదని అన్నారు. 15 రోజుల్లో 100 శాతం మందికి కనీసం తొలి డోసు వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం అలసత్వం వద్దని హితవు పలికారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 27 వేల బెడ్స్ ఉన్నాయని... ఈ నెలాఖరుకు మరో ఏడు వేల పడకలను సిద్ధం చేస్తామని చెప్పారు.

ఇటీవల ఎన్‌ఐడీఎం నిపుణులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో... కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. చిన్నారుల వైద్యం కోసం సిబ్బందిని పెంచాలని సూచించారు. కరోనా థర్డ్‌వేవ్ వస్తే... ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు సరిపోవని పేర్కొన్నారు. దేశంలో వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, అంబులెన్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 82 శాతం శిశు వైద్యుల కొరత ఉందని.... కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63 శాతం ఖాళీలున్నాయని నివేదికలో తెలిపారు. కరోనా థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచించారు.ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం(ఆగస్టు 24) సమీక్ష నిర్వహించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ పరిస్థితులు, థర్డ్ వేవ్‌పై అధికారులతో చర్చించారు.కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు సలహాలు,సూచనలు ఇచ్చారు.
బూస్టర్ డోసు :
కొవిడ్-19 వేరియంట్లను నిరోధించాలంటే తప్పనిసరిగా బూస్టర్ డోసు వేయించుకోవాలనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే అమెరికా,జర్మనీ, కెనడా, ఫ్రాన్స్ దేశాలు బూస్టర్ డోసులను వేస్తున్నాయి. కొవిడ్ బూస్టర్ డోసుల సామర్థ్యంపై ఇజ్రాయెల్ చేసిన అధ్యయనంలో... వీటి ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతోందని తేలింది. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిలో కంటే మూడో డోసు తీసుకున్నవారిలో వైరస్ నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా రక్షణ ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు.












Click it and Unblock the Notifications